ప్రాణాలకు తెగించి వైద్యం అందించిన వైద్య సిబ్బంది

నవతెలంగాణ-మంగపేట
భారీ వర్షాల్లో సైతం వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి గిరిజన గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి ఆస్పత్రి వైద్యాధికారి కారం నిఖిల్ తన సిబ్బంది బుదవారం కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయక ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటి ఆస్పత్రి పరిధిలోని పరిధిలోని దోమెడ గ్రామంలో రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దోమెడలో ఇంటి కొకరు జ్వరం, వైరల్, మలేరియా భారినపడి మంచాన పడ్డట్లు గ్రామస్తులతో సమాచారం తెలుసుకున్న వైద్యుడు నిఖిల్ ఎడతెరిపిలేని వర్షాల వల్ల కొన్నిదోమెడ గ్రామానికి మద్యలో పారుతున్న ఒర్రెలు, వాగులు ఉద్రుతంగా ప్రవహిస్తున్నప్పటికీ లెక్కచేయకుండా గ్రామానికి వెళ్లి వైద్యం అందించారు. వర్షాల కారణంగా గిరిజనులు ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోలేని స్థితిని దృష్టిలో పెట్టుకోని దోమడ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంసిబ్బందితో వెళ్లి అక్కడివారికి వైద్య పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం వారికి పరిసరాల పరిశుభ్రత, రోగ నిరోధక శక్తి బలపడే విధంగా పౌష్టికాహారం తీసుకోవాలని , కాచి వడబోసిన నీరు మాత్రమే తాగాలని, వర్షం నీటిలో తడవకూడదని ఆరోగ్య సూచనలు ఇచ్చారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాగులు దాటి వచ్చిన వైద్య సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, ల్యాబ్ టెక్నీషియన్ రాంబాబు, ఏఎన్ఎం సీతారావమ్మ, ఆశ నలిని పాల్గొన్నారు.

Spread the love