రాజ్‌నాథ్‌ నివాసంలో ముగిసిన మంత్రుల భేటీ

నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికతో పాటు పార్లమెంట్‌ సమావేశాల్లో ఎన్డీయే పక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు జరిగిన మంత్రుల భేటీ ముగిసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో మంగళవారం సాయంత్రం సుదీర్ఘంగా సాగిన భేటీలో పార్లమెంట్‌ సమావేశాలు, స్పీకర్‌ ఎన్నికపై ప్రధానంగా చర్చలు జరిగాయి. స్పీకర్‌ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంతో పాటు, స్పీకర్‌ పదవికి ఎన్డీయే పక్షాలతో పాటు విపక్షాల్లోనూ ఏకాభిప్రాయం సాధించేలా ఎలా కసరత్తు సాగించాలనే దానిపై మంత్రులు చర్చించారు. స్పీకర్‌ పదవిపై ఎన్డీయే పక్షాలతో పాటు విపక్షాల నుంచి ఏకాబిప్రాయాన్ని సాధించే బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. జూన్‌ 26న స్పీకర్‌ ఎన్నిక జరగనుండటంతో ఆనవాయితీ ప్రకారం తమకు డిప్యూటీ స్పీకర్‌ను కేటాయించని పక్షంలో స్పీకర్‌ పదవికి అభ్యర్ధిని నిలిపేందుకు విపక్ష ఇండియా కూటమి సంసిద్ధమైందని చెబుతున్నారు. ఇక బీజేపీ ఎంపీ ఓం బిర్లా ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.

Spread the love