నవతెలంగాణ – బెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయి చర్చలను ప్రారంభించారు. కనీస ఉమ్మడి కార్యక్రమ (సీఎంపీ) రూపకల్పనకు ఒక ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం వంటివాటిపై నేడు చర్చించనున్నారు. రాష్ట్రాలవారీగా సీట్ల సర్దుబాటు ఎలా జరగాలి, ఎన్నికల వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు ప్రతిపాదించాలి వంటి అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కూటమికి పేరును కూడా నిర్ణయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక, విపక్షాల ఫ్రంట్ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ‘చీలిక’ పరిణామాలతో సోమవారం నాటి విందుకు దూరమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేడు విపక్షాల భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్, ఇతర విపక్ష నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.