– ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ – 2024లో మంత్రి కిషన్‌రెడ్డి
వతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సముద్రాల్లోని ఖనిజాలను సద్వినియోగం చేసుకునేందుకు ఆఫ్ షోర్ మైనింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించామనీ, ఆఫ్ షోర్‌పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రెండు, మూడు నెలల్లో ఈ బ్లాకుల వేలం వేస్తామని ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ – 2024ను ప్రారంభించారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ, ప్రయివేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మైనింగ్ విషయంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. అదే సమయంలో విదేశాల్లో ఉండే క్రిటికల్ మినర ల్ బ్లాక్స్ వేలంలో పాల్గొంటున్నామనీ, అక్కడ ఉత్పత్తి చేసి మన దేశంలో వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పారు. తాజా బడ్జెట్‌లోనూ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రకటించి.. ఇందుకోసం ప్రత్యేక నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్ లను వేలంలో దక్కించుకున్నామనీ, అక్కడ ఎక్స్‌ప్లొరేషన్ (తవ్వకాల) పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఇంధన భద్రత, సృజనాత్మకత, సుస్థిర మైనింగ్ పద్ధతులు, పర్యావరణ సుస్థిరత, బాధ్యతాయుత మైనింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కోలిండియా స్వర్ణోత్సవాలు ఏడాది పాటు జరుగుతాయని చెప్పారు. బొగ్గు ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించడం, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా గనుల నిర్వహణ, కార్మికుల భద్రతపై కోలిండియా ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు.