– ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– జీహెచ్‌ఏంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.24వేలకు పెంచాలని, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో లిబర్టీలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో పాలడుగు భాస్కర్ మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కోటి మంది ప్రజానీకానికి పారిశుధ్య నిర్వహణలో జీహెచ్‌ఏంసీ కాంట్రాక్ట్ కార్మికులు 25ఏండ్లుగా సమర్ధవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో వేతనాలు పెరిగి మూడేండ్లు అవుతున్నదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పేరుతో వేతనాలు పెంచడంలో జాప్యం చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పోయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందన్నారు. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల్లో అధిక సంఖ్యలో మహిళలే పనిచేస్తున్నారని, మహిళా కమిషనర్ అర్థం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు ఆఫ్‌లతోపాటు ఏడాదికి 15రోజుల వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా తీసుకొచ్చిన వేలి ముద్రలు, బయోమెట్రిక్ విధానంతో సమస్యలు తలెత్తుతున్నాయని, దాన్ని తీసేసి.. బుక్‌లోనే హాజరు తీసుకోవాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జె.వెంకటేష్ మాట్లాడుతూ.. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని, పురుష కార్మికులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. హాజరులో, వేతనాల చెల్లింపులో జరుగుతున్న అవినీతిని అరికట్టాలన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు వీవీ మంగపతి మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు అనారోగ్యపాలైనా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైరయ్యే కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకోకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం తీవ్రంగా పెరుగుతున్నదన్నారు. ఇ.అంజయ్య మాట్లాడుతూ.. రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (పరిపాలన) నళినీ పద్మావతికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు యేసురత్నం, వనంపల్లి జయపాల్‌రెడ్డి, రెబ్బా రామారావు, హెచ్‌ఎంఎస్ నాయకులు పి.నర్సయ్య, సి.మహేష్, బీఆర్‌టీయూ నాయకులు జి.కుర్మన్న, వి.మారన్న, టీఎన్‌టీయూసీ నాయకులు ఎంకే.బోస్, వెంకటేశ్వరావు, ఐఎఫ్‌టీయూ నాయకులు శివబాబు, ఏఐయూటీయూసీ నాయకులు బాబూరావు, అంజనేయులు, కార్మికులు పాల్గొన్నారు.