– కోఠి డీఎంహెచ్‌ఎస్ వద్ద ఆశావర్కర్ల ఆందోళన
– తీవ్ర ఉద్రిక్తత, అరెస్ట్ – సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు మహిళలు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్/ధూల్‌పేట్
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు సోమవారం హైదరాబాద్ కోఠి డీఎంహెచ్‌ఎస్ ఆవరణలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆశా వర్కర్లు.. బారికేడ్లను తోసుకొని రోడ్డుపైకి రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చినట్టు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులకు.. ఆశాలకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. రోడ్డుపైకి చేరిన ఆశాలను పోలీసులు అరెస్టు చేసి డీసీఎం వ్యాన్‌లలోకి ఎక్కించారు. ఈ క్రమంలో సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసచారిపై ఓ ఆశా కార్యకర్త చేయి చేసుకున్నారు. అరెస్టు చేసే క్రమంలో ఇద్దరు మహిళలు సోమసిల్లి పడిపోవడంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అరెస్టు చేసిన వారిని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. అంతకుముందు ఆందోళనకు మద్దతుగా వచ్చిన బీఆర్‌టీయూ నాయకులు రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. బందోబస్తులో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, సుల్తాన్ బజార్ డివిజన్ ఏసీపీ శంకర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
ఆశా వర్కర్లకు బీఆర్‌ఎస్ శ్రేణుల పరామర్శ
అస్వస్థతకు గురైన ఆశా వర్కర్ రహేంబీ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెను మాజీ మంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి డ్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ రఫీని అడిగి తెలుసుకున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, పలు రకాలైన రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్‌ఎస్ శ్రేణులు కోరాయి. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించాలని అడిగిన వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. అస్వస్థతకు గురైన మరో ఆశావర్కర్ సునీతకు ప్రాథమిక చికిత్స చేసి పంపించారు.