కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల హత్య.. విదేశాంగ శాఖ తీవ్ర విచారం

నవతెలంగాణ-హైదరాబాద్ : కెనడాలో ఇటీవల ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్యకు గురికావడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు కేంద్రం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా విదేశాంగశాఖ చర్యలు తీసుకుంటోందని.. ఒట్టావాలోని భారత హై కమిషన్‌తోపాటు, టొరంటో, వాంకోవర్‌లలోని కాన్సులేట్‌లను ఇప్పటికే అప్రమత్తం చేశామని పేర్కొంది.
భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడి అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నామని, విదేశాల్లో ఉన్న భారత పౌరుల రక్షణే కేంద్రానికి తొలి ప్రాధాన్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. కెనడాలోని భారతీయులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే, అధికారిక గణాంకాల ప్రకారం, కెనడాలో దాదాపు 4 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు.

Spread the love