– ప్రాజెక్టుల దుస్థితికి కాళేశ్వరమే నిదర్శనం
– అధికారులు, వ్యవస్థల కంటే ప్రజల్లో ఉండటమే ఇష్టం : మాదిరిపురం సభలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇచ్చిన మాట.. చెప్పిన పథకం అమలే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల దుస్థితికి కాళేశ్వరమే నిదర్శనమని, పైగా సిగ్గూ శరం లేకుండా ప్రాజెక్టులు కట్టామని చెప్పుకుంటు న్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గిరిజన మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. తన చుట్టూ ఉండే అధికారులు, వ్యవస్థల కంటే ప్రజల్లో ఉండటమే తనకు ఎక్కువ ఇష్టమని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగింటిని అమలు చేశామని చెప్పారు. ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులను మండల కార్యాలయాల్లో సరిచేసుకోవచ్చని సూచించారు. 200 యూనిట్లలోపు బిల్లు వచ్చే వారందరికీ ఇక కరెంట్ ఉచితమేనని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తెచ్చి రాజధాని చుట్టూ భూములను కొల్లగొట్టిందన్నారు. చిన్నచిన్న సమస్యలనూ పరిష్కరించ కుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, లక్షలాది అర్జీలను పట్టించుకోలేదన్నారు. త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని చెప్పారు. మరో వారం పది రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానన్నారు. తాను హైదరాబాద్‌లో ఉన్నా.. అదీ రాష్ట్ర ప్రజల పని నిమిత్తమే అని వివరించారు. సభలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఎంపీపీ బాణోత్ మంగీలాల్, జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రామిరెడ్డి చరణ్‌రెడ్డి, రామస హాయం నరేష్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.