– ఏసీబీ ముందు బీఎల్‌ఎన్ రెడ్డి వ్యాఖ్య
– ఆరున్నర గంటల పాటు సాగిన విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో విదేశీ కంపెనీకి హెచ్‌ఎండీఏ తరఫున నిధులను ఉన్నతాధికారుల ఆదేశం మేరకే బదిలీ చేశానని హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి వెల్లడించారని తెలిసింది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో మూడో నిందితుడైన బీఎల్‌ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించారు. ఐఓబీ బ్యాంకు ఖాతా ద్వారా ఈ డబ్బులను ఎఫ్‌ఈఓ కంపెనీకి బదిలీ చేసినట్టు అంగీకరించారు. అయితే, ఒక ఉన్నతాధికారిగా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీ చేసే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి అనుమతి తీసుకోవాలని తెలియదా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదని తెలిసింది. దీని ఫలితంగా రూ.8 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానాను ఆర్బీఐ విధించింది కదా అన్న ప్రశ్నకు కూడా.. తాను ఉన్నతాధికారుల అనుమతి మేరకే చేశానని బీఎల్‌ఎన్ రెడ్డి సమాధానమిచ్చినట్టు సమాచారం. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ నిర్వహణలో తాను నిర్వహించిన పాత్ర పూర్తిగా ఉన్నతాధికారుల సూచనతోనేనని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చినట్టు తెలిసింది. విదేశీ కంపెనీకి డబ్బులు బదలాయించే విషయమై అప్పటి మంత్రి కేటీఆర్ మీకు ఆదేశాలిచ్చారా? లేక అప్పటి హెచ్‌ఎండీఏ కార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదేశాల మేరకు చేశారా? అని ఏసీబీ ప్రశ్నించగా.. తాను పైవారి మాట మేరకే చేశానని చెప్పినట్టు సమాచారం. కాగా, ఆరున్నర గంటల పాటు బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ అధికారులు అంతకముందు కేటీఆర్, అరవింద్ కుమార్‌లను విచారించిన సందర్భంలో వెళ్లడైన అంశాలను జోడించి బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈయన విచారణలో సైతం ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌కు సంబంధించి కొన్ని కీలకాంశాలను ఏసీబీ అధికారులు రికార్డు చేసినట్టు సమాచారం. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని బీఎల్‌ఎన్ రెడ్డికి అధికారులు చెప్పారు.