నర్గేస్ మొహమ్మది… ఇరాన్ మహిళల హక్కుల సాధన ఆమె లక్ష్యం. ఇరాన్‌లో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయాలన్నది ఆమె కోరిక. స్త్రీల స్వేచ్ఛా సమానత్వాల సాధన ఆమె ఉద్యమ గీతం. వాటి సాధనకు యాక్టివిజాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. ఆ ప్రయాణంలో నిర్బంధాలు భయపెట్టలేదు. జైలు గోడలు సైతం ఆమె స్వేచ్ఛను నిర్బంధించలేకపోయాయి. పోరాటాన్ని నీరుగార్చలేకపోయాయి. అందుకే జైల్లో ఉండగానే నోబుల్ బహుమతికి ఎంపికయ్యారు. ఇప్పటికే జైలు జీవితం అనుభవిస్తున్న ఆమె ఇక విడుదల అవుతారు అనుకుంటున్న సమయంలో ఇరాన్ ప్రభుత్వం ఆమె శిక్షణను మరో ఏడాది పొడిగించింది. ఆ హక్కుల కార్యకర్త పరిచయం నేటి మానవిలో…
ఇరాన్‌లో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా, ఉన్నతమైన అకడమిక్ స్థానాల్లో ఉంటున్నా, ప్రభుత్వ ఉద్యోగాల్లో పురుషులకు తీసిపోనివిధంగా ముందుంటున్నా, అక్కడి మహిళల జీవితాలు వారి చేతుల్లో లేవు. స్వేచ్ఛ వారికి ఒక అందమైన కల మాత్రమే. స్త్రీలపై ఊపిరితిప్పుకోలేనంత నియంత్రణ, పురుషాధిక్యం కొనసాగుతోంది. ప్రతి స్త్రీ హిజాబ్ లేదా స్కార్ఫ్ తప్పనిసరిగా ధరించాలన్న చట్టాల కబంధహస్తాలు ఇరాన్ స్త్రీలను తీవ్ర అసహనానికి, ఆందోళనలకు గురిచేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో నార్గిస్ చేబట్టిన మహిళా హక్కుల చైతన్య ఉద్యమం ఇరాన్ స్త్రీలలో లావాలా ఉప్పొంగింది. అదే ఆమెను టార్గెట్ చేసేలా చేసింది.
మహిళా హక్కులపై ఉద్యమం
నర్గేస్ 1972లో జాన్‌జాన్‌లో జన్మించారు. ఫిజిక్స్‌లో డిగ్రీ చేశారు. మహిళలపై ఆంక్షలు విధించే ఇరాన్‌లో మహిళా హక్కులపై నర్గేస్ చదువుకున్న రోజుల నుంచే గళం విప్పారు. ఇంజనీరింగ్ చదివి కొంతకాలం కాలమిస్ట్‌గా పలు వార్తాపత్రికల్లో చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌లో 2003లో చేరారు. ఆ తర్వాత ఆ సంస్థ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తొలిసారి అరెస్టయి జైలుకు వెళ్లారు. జైళ్లలో ఉంటూనే మహిళా హక్కులపై ఉద్యమం కొనసాగించారు. నిషేధిత యాక్టివిస్టులకు సహాయపడ్డారనే ఆరోపణలతో 2011లో మరోసారి జైలుకు వెళ్ళి 2013లో బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పుడే మరణశిక్షను ఎత్తివేయాలని ప్రచారాన్ని చేపట్టారు. 2015లో తిరిగి అరెస్టయి జైల్లో నిర్బంధమయ్యారు. అయినా తన హక్కుల గళాన్ని జైలు నాలుగ్గోడల నుంచి ప్రపంచమంతా వ్యాపించేలా చేసి ఇరాన్ పాలకులకు చెమటలు పట్టించారు.
రెండు కారణాలు…
ఆమె యాక్టివిజం బాట పట్టడానికి రెండు కారణాలున్నాయి. నర్గేస్ పసితనంలో ఆమె తల్లి జైలులో ఉన్న తన సోదరుడి దగ్గరకు తరచూ వెడుతుండేవారు. ఆమె వెంట నర్గేస్ కూడా వెళ్లేవారు. ఇంకొక ముఖ్య కారణం ఏమిటంటే నిత్యం ఉరివేసే ఖైదీల గురించిన ప్రకటనలు టీవీలో ప్రసారం చేసేవారట. ఇవి రెండూ ఆమె మనసులో అలాగే నాటుకుపోయాయి. చదువుకునే రోజుల్లో రాజకీయ యాక్టివిస్టు అయిన తఘి రహ్మానీని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఆయనా తీవ్ర జైలు శిక్షను అనుభవించారు. ప్రస్తుతం తమ ఇద్దరు బిడ్డలతో ఆయన ఫ్రాన్స్‌లో ప్రవాసంలో ఉన్నారు.
నోబెల్ శాంతి బహుమతి
తను కొనసాగిస్తున్న ఈ పోరు మరింత ఉత్తేజితంగా, ధైర్యంగా ముందుకు సాగించేలా మరింత బలాన్ని, నిబద్ధతను, ఆశను 2023లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి రూపంలో వచ్చి చేరింది. ఈమెకు ముందు 2003లో నోబెల్ శాంతి బహుమతి మానవహక్కుల యాక్టివిస్టు షిరాన్ ఇబాదికి వచ్చింది. 122 ఏండ్ల నోబెల్ శాంతి బహుమతి చరిత్రలో జైలు లేదా గృహ నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తికి ఈ అవార్డు రావడం ఇది ఐదవసారి. 2022లో స్కార్ఫ్ సరిగా కట్టుకోలేదని ఇరాన్ మొరాలిటీ పోలీసులు 22 ఏండ్ల మొహసా అమిని అనే యువతిని అరెస్టు చేశారు. తర్వాత పోలీసు కస్టడీలో ఆమె చనిపోయింది. ఆమె మరణంతో ఇరాన్ కల్లోలమైంది. జనసముద్రం ప్రభుత్వంపై విరుచుకుపడింది. హక్కుల గళాలు మారుమోగాయి. ఆ సమయంలో నిరసనల ప్రదర్శనలు దేశమంతా వెల్లువెత్తాయి. అప్పుడు 500 మంది ప్రాణాలు కోల్పోతే, 22 వేల మందికి పైగా నిర్బంధించబడ్డారు. ఆ సందర్భంలోనూ నర్గేస్‌ను ఇరాన్ పాలకులు నిర్బంధించారు. దీనిపై ప్రతిస్పందిస్తూ ప్రజలను ఎంతగా నిర్బంధిస్తే అంతగా తిరగబడతారని ప్రభుత్వం గ్రహించడం లేదని ఆమె అన్నారు. హిజాబ్‌ను తప్పనిసరి చేస్తూ అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది ఇరాన్ పాలకులకు మింగుడుపడలేదు. స్త్రీలపై వ్యవస్థాగతంగా కొనసాగుతున్న అణచివేత, వివక్షతలపై ఆమె పోరాటం, ఆమె నెరిపిన ఉద్యమం ఎందరో మహిళల్లో స్వేచ్ఛాకాంక్ష పెల్లుబుకేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
జైలు శిక్షను ఎందుకు పొడిగించారు?
ప్రస్తుతం జైల్లో ఉన్న నర్గేస్ నోబుల్ బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా తనను విడుదల చేయాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది. ఆమె న్యాయవాది మోస్తఫా నీలి అసోసియేటెడ్ మాటల ప్రకారం వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆరోపణలపై ఆమె దోషిగా నిర్ధారించబడ్డారు. ఇరాన్‌లో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించాలని ఆమె ఓటర్లను కోరడం, యూరప్‌లోని చట్టసభ సభ్యులకు లేఖలు పంపడం కారణంగా చూపుతున్నారు. అలాగే ఇరాన్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్, రాజకీయ కార్యకర్తపై జరిగిన లైంగిక వేధింపులకు వ్యతిరేంగా మాట్లాడడం కూడా మరో కారణంగా చూపి ఆమె జైలు జీవితాన్ని పొడిగించారు.
31 ఏండ్ల జైలు శిక్షతో…
2022లో ఆమె రాసిన ‘వైట్ టార్చర్ ‘ పుస్తకం పెద్ద సంచలనాన్ని సృష్టించింది. జైళ్లల్లో ఒంటరి ఖైదీగా తన అనుభవాలను ఆ పుస్తకంలో రాసారు. బీబీసీ 100 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో ఆమె కూడా ఉన్నారు. హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నోసార్లు కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు దోషిగా నిర్దారించి, మొత్తం 31 ఏండ్ల జైలు శిక్షతో పాటు కోర్టులు 154 కొరడా దెబ్బలు విధించాయి. టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో ఎన్నో ఏండ్లుగా బంధీగా ఉన్నారు. భర్త రహ్మానీ నార్గిస్‌ను చూసి పదకొం డేండ్లు దాటిపోయింది. ఆమె పిల్లలు తల్లిని ప్రత్య క్షంగా చూసి ఎన్నో ఏండ్లయి పోయింది. ఇలా ప్రజా స్వామ్యం, సమానత్వం, మహిళా హక్కులు, స్వేచ్ఛ కోసం వెన్నుచూపకుండా నర్గేస్ ముఫ్ఫై ఏండ్లకు పైగా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు.