ప్రియుడితో కలిసి తల్లి హత్య…

నవతెలంగాణ – ఉత్తర్​ప్రదేశ్​
తమ ప్రేమకు అడ్డుగా ఉన్న ప్రేయసి తల్లిని కిరాతకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ హత్య వ్యవహారంలో మృతురాలి కూతురు పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రా భవ్న అరోమా ప్రాంతంలోని శాస్త్రిపురం సికంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తమ ప్రేమకు అడ్డు చెపుతోందన్న కోపంతో పదునైన ఆయుధంతో గొంతుకోసి చంపాడు. అయితే ఈ ఘటనలో మృతురాలి మైనర్ కూతురు పాత్ర ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
భావ్న అరోమా ప్రాంతానికి చెందిన ఉదిత్ బజాజ్​, అంజలి బజాజ్ భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు ఉంది. ఉదిత్ బజాజ్ ఫుట్​వేర్ వ్యాపారి. అయితే, బుధవారం రాత్రి నుంచి తన భార్య అంజలి కనిపించడం లేదని ఉదిత్.. సికంద్ర పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తన భార్య అంజలి సమీపంలోని మహాదేవ్ ఆలయానికి వెళ్లి తిరిగిరాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మహాదేవ్ ఆలయ సమీపంలో అంజలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అంజలి కూతురు వాట్సాప్​ ద్వారా తన తల్లికి మహాదేవ్ ఆలయానికి రమ్మని పిలిచింది. అంజలి ఈ విషయాన్ని తన భర్త ఉదిత్​తో చెప్పి.. ఇద్దరూ కలిసి మహాదేవ్ ఆలయానికి చేరుకున్నారు. అదే సమయంలో ‘గురూస్ పూల్’ వద్దకు వచ్చి తనను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కూతురు నెంబర్​ నుంచి ఉదిత్​కు మరో సందేశం వచ్చింది. దీంతో ఉదిత్​ తన భార్య అంజలిని ఆలయం వద్దే వదిలి కూతురు చెప్పిన అడ్రస్​కు బయళ్తేరాడు. అంతలోనే తను ఇంటికి చేరుకున్నట్లు కూతురు ఫోన్​ చేసి తండ్రితో చెప్పింది. ఇక తిరిగి ఆలయానికి వెళ్లిన ఉదిత్​ బజాజ్​కు తన భార్య అక్కడ కనిపించలేదు.
‘అంజలి ఫోన్ కనిపించడం లేదు. ఇక్కడ అంజలికి తన మైనర్ కూతురు మధ్యలో మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె తన ప్రియుడు ప్రాకర్ గుప్తను కలిసేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. తమ కూతురు కంటే ప్రాకర్ వయసు ఎక్కువ కావడం వల్ల వారి ప్రేమకు అంజలి అంగీకరించలేదు. తన కూతురుపై నిఘాపెంచింది తల్లి అంజలి. దీంతో ప్రేయసి తల్లి అంజలిపై కోపం పెంచుకున్న ప్రాకర్ ఆమెను హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలనున్నాయి’ అని పోలీస్ కమిషనర్ ప్రీతిందర్ సింగ్ తెలిపారు. ఈ హత్య కేసులో మైనర్ కూతురు, ఆమె ప్రియుడు ప్రాకర్​తో పాటు అతడి స్నేహితుడి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆరు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సికంద్ర పోలీస్ స్టేషన్​ ఇన్​ఛార్జ్​ ఇన్​స్పెక్టర్​ ఆనంద్ కుమార్ తెలిపారు.

Spread the love