కొత్త బాలకృష్ణని చూస్తారు

The new Balakrishna will be seen‘సినిమా విషయంలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. నిర్మాతలకు అసలు నష్టం రానివ్వకూడదనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు. సినిమా కోసం ఎంతయినా కష్టపడతారు. వారితో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని దర్శకుడు బాబీ కొల్లి అన్నారు.
బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి తెరకెక్కించిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలు. బాబీ డియోల్‌, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా నేడు (ఆదివారం) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ కొల్లి శనివారం మీడియాతో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
– బాలకృష్ణ ఇమేజ్‌ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దష్టిలో ఉంచుకొని ఈ సినిమా చేశాను. అయితే ఆయన గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించా. బాలయ్య సెటిల్డ్‌గా డైలాగ్‌లు చెప్తే చాలా బాగుంటుంది. ‘నరసింహనాయుడు’, ‘సమరసింహారెడ్డి’ తర్వాత ‘సింహా’ ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. ‘డాకు మహారాజ్‌’ కూడా అలా గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
– బాలకృష్ణని నిర్మాత నాగవంశీ ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్‌లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాం. మా విజన్‌కి తగ్గట్టుగానే డీఓపీ విజరు కన్నన్‌ అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. అలాగే ఇందులో హీరోకి ఆయుధం అనేది కీలకం. ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ అద్భుతమైన ఆయుధాలను డిజైన్‌ చేశారు. తమన్‌ సంగీతం గురించి వేరే చెప్పక్కర్లేదు. పాటలు, నేపథ్య సంగీతం అదిరిపోయాయి.
– ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌వి ప్రాధాన్యం ఉన్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే రెగ్యులర్‌ విలన్‌ పాత్రలా కాకుండా బాబీ డియోల్‌ పాత్ర కొత్తగా ఉంటుంది.
– నా గత సినిమాలతో బాబీ కథా కథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్‌ స్థాయిలో విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు ఈ సినిమా విజువల్స్‌ పరంగా గొప్ప పేరు తీసుకొస్తుంది.

Spread the love