నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాల్సిందే

– ఆగస్టు 1న ఛలో రాజ్‌ భవన్‌ : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యావిధానం-2020ను రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 1న ‘ఛలో రాజ్‌భవన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆదివారం నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి.నాగరాజు మాట్లడుతూ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకోచ్చిందని, ఇది ప్రభుత్వ విద్యకు నష్టం చేసి ప్రయివేట్‌, కార్పొరేట్లకు లాభం చేసేవిధంగా ఉందన్నారు. ప్రాథమిక విద్యారంగంలో డ్రాపౌట్స్‌ పెంచడంతోపాటు మళ్ళీ వర్ణ, కుల వ్యవస్థ తీసుకుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. పరిశోధన, ఫెలోషిప్‌ లేకుండా విదేశీ యూనివర్శీటీలే ఈ దేశంలోకి స్వేచ్ఛగా వచ్చే విధానాలను ఈ నూతన విద్యావిధానం పేరుతో అమలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. యూజీసీ రద్దు చేసి ప్రయివేట్‌, ప్రభుత్వ వ్యక్తుల భాగస్వామ్యంతో గవర్నింగ్‌ బాడీని తీసుకురావడం అంటేనే విద్యను పూర్తిగా ప్రయివేటీకరణ చేయడమేనని పేర్కొన్నారు. ఆరెస్సెస్‌ ఎజెండా విద్యరంగంలో అమలు చేసేందుకే సిలబస్‌ మార్పులు తీసుకురావడం, జాతీయోద్యమ వీరుల చరిత్రలు మార్చడం, డార్విన్‌ సిద్దాంతాన్ని మార్చడం లాంటివి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకు విభజన హామీలను అమలు చేయడం లేదని, ఉన్నత విద్యాసంస్థలను ఇవ్వడం లేదని విమర్శించారు. గిరిజన యూనివర్శీటీనీ కేటాయించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర యూనివర్శీటీల విద్యార్ధులకు ఫెలోషిప్‌ ఇవ్వడం లేదని, మోడీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయలేదని అన్నారు. వీటన్నింటికి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆగస్టు 1న ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు లెనిన్‌గువేరా, జిల్లా ఉపాధ్యక్షుడు స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love