బాల గేయాల ‘చిగురింతల’ కొత్త జండా

మొదటగా ఇందూరు జిల్లా… అదే మన నిజామాబాద్‌ జిల్లా బాల సాహితీవేత్తలకు అభినందనలు… ఇటీవల ‘బాలల సాహిత్య వేదిక’ ద్వారా ఒక్కటిగా కావడం అభినందనీయం. నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ బాల సాహిత్యం విరివిగా వచ్చింది, నేడూ వస్తోంది. ఇది శుభ పరిణామం. ఈ ఇందూరు ఖిల్లా మీద బాల సాహిత్యపు కొత్త జండా చింతల శ్రీనివాస్‌ గుప్త. నిజామాబాద్‌లో జూన్‌ 6, 1972న శ్రీనివాస్‌ గుప్తా పుట్టారు. శ్రీమతి గంగామణి – శ్రీ చింతల రాములు వీరి తల్లితండ్రులు.
వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్న చింతల శ్రీనివాస్‌ గుప్త కవి, రచయిత, నాటకకర్త. పద్యాన్ని, గేయాన్ని, వచన కవిత్వాన్ని సమానంగా ప్రేమించి రాసే చింతల నాటకాలు, ఏకపాత్రలు, కథలు, కథానికలు, చిత్రపద కథలు, సాహిత్య ప్రహేళికలు వంటి రూపాల్లో రచనలు చేశారు. చిత్రలేఖనం వీరి అభిరుచి కావడం విశేషం. వీరి తొలి రచన ‘శ్రీవిలాస శతకము’. ఇది 2013లో వచ్చింది. ‘చీమకున్నయంత చేవలేని మనిషి/ గార్దబంబు కన్న ఘనుండు గాడు/ ప్రతిభ గలుంగు తవలయు పట్టపు రాజైన/ శ్రీవిలాస మందు శ్రీనివాస’ ఇందులోని పద్యం. తరువాత రాసిన శతకం ‘చింతల శ్రీను’ శతకం. ఇది అచ్చులోకి రావాల్సివుంది. కథల సంపుటి ముద్రణకు సిద్ధంగా వుంది. పిల్లలు పాఠశాలలో ప్రదర్శించుకునేందుకు అనువుగా తెగని గాలిపటం, ఎలుకమ్మ పెళ్ళి, కుక్కతోక వంకర వంటి నాటకాలు రాశారు వీరు. ఇవేకాక ‘పంటిగాడు’, ‘నేనెవరురా?’ మొదలైన ఏకపాత్రలు కూడా వీరి రచనల్లో వున్నాయి. శ్రీనివాస్‌ రచించిన బాల కార్మిక వ్యవస్థకు సంబంధించినవి ఇటీవల రికార్డు అయ్యాయి. సినిమా పాటలకు పేరడీ గేయాలు కూర్చి, వాటికి బాణీ కట్టడంలో కూడా ఈయనకి చక్కని అభిరుచి, ప్రవేశం వుంది. శ్రీనివాస్‌ గీసిన చిత్రాలు పలు పుస్తకాలకు ముఖచిత్రాలుగా కూడా అచ్చయ్యాయి.
సభా వ్యాఖ్యానం పట్ల ఆసక్తితో పలు సభలకు వ్యాఖ్యానం చేసిన శ్రీనివాస్‌ శతాబ్ది సాహితీ పురస్కారం, దశాబ్ది ఉత్సవ సత్కారం, ఉగాది పురస్కారంతో పాటు వర్ని మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఆకాశవాణి ద్వారా వీరి నాటికలు ప్రసారమయ్యాయి. రచయితగానే కాక సంపాదకులుగా విద్యాశాఖ వారి పుస్తకాలకు, ‘ఇందూరు బాల’ నిజామాబాద్‌ జిల్లా బాలల మాస పత్రిక ప్రపంచ తెలుగు మహాసభల సావనీర్‌, తెలంగాణ సారస్వత పరిషత్‌ వారి నిజామాబాద్‌ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాల సంపాదక మండలిలో సభ్యులుగా ఉన్నారు. బాల సాహితీవేత్తగా చింతల శ్రీనివాస్‌ గుప్త తొలి రచన ‘చిగురింతలు’ బాల గేయాలు ప్రచురించారు. దీనిని వీరు ‘చింతల బాల సాహిత్యం’ పేరుతో ప్రచురించారు. పద్యం, మాత్రా ఛందస్సు తెలిసిన చింతల గేయాలన్నీ అందంగా, విలక్షణంగా ఉంటాయి. ‘సైకిల్‌ ఎక్కి నేను చైనా పోతాను/ మోటర్‌ ఎక్కి నేను రష్యా పోతాను/ ఆటో ఎక్కి నేను అమెరికా పోతాను/ కారు ఎక్కి నేను ఖాట్మండు పోతాను/ బస్సు ఎక్కి నేను బర్మా పోతాను/ లారి ఎక్కి నేను లండన్‌ పోతాను’ అంటాడు. తెలుగు పెద్దల గురించి ఒక గేయంలో ఇలా చెబుతాడు… ‘భారతం రాసింది ఎవరురా నాన్నా/ నన్నయ్య, తిక్కన్న, యెర్రనలని విన్న’ అంటూ సాగుతుంది. ఇదే కోవలో తెలుగు శతకకర్తల గురించి చెబుతాడు శ్రీనివాస్‌ గుప్త. ‘వేమన మకుటము ఏమని చెప్పెను/ విశ్వద అభిరామ వినుమన లేదా’ అని. ఇటువంటిదే – ‘నా పేరు బుడుగు-ఇంటి పేరు గిడుగు/ వర్షం వచ్చిందంటే- పడుతుంది పిడుగు/… నాన్నమ్మ కర్ర-నాకన్న పొడుగు/ బయటకెళ్ళి వస్తే- రెండు కాళ్ళు కడుగు’ గేయం.
ఈ చిగురింతలులోని గేయాలన్నీ పిల్లలకు నచ్చడమేకాక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. పదమూడేళ్ళ వయస్సులోనే రచన ప్రారంభించిన చింతల శ్రీనివాస్‌ ఇవ్వాళ్ల పిల్లల కోసం రాయడం విశేషం. పిల్లలకు తన రచనలో వివిధ అంశాలను పరిచయం చేస్తూనే సంస్కారాన్ని, విలువలను నేర్పుతాయి. ‘అమ్మకు ఒకటి ఇచ్చాను/ నాన్నకు ఒకటి ఇచ్చాను/ నానికి ఒకటి ఇచ్చాను/ తాతకు ఒకటి ఇచ్చాను/ తమ్మునికి ఒకటి ఇచ్చాను’ అన్న ‘అప్పాలు’ గేయం అందుకు నిదర్శనం. పిల్లలు ఎలా ఉండాలో దినచర్య గేయంలో చెబితే, మరో గేయంలో నిన్నటి మన తరాన్ని అలరించిన ‘కలం స్నేహం’ గురించి రాస్తారు. ‘కలం స్నేహం చేస్తాను/ కవితలెన్నో రాస్తాను’. చింతల శ్రీనివాస్‌ గుప్త రాసిన గేయాల్లో చక్కని గేయం ‘మొక్క’. పుట్టినరోజున ఏం చేయాలో చెబుతూ… ‘పుట్టిన రోజు వచ్చిందా/ మొక్కను ఒకటి నాటాలి/ పండగ రోజు వచ్చిందా/ మొక్కను ఒకటి నాటాలి/ పై తరగతులకు వెళ్ళావా/ మొక్కను ఒకటి నాటాలి/ సంబరాలను చేసావా/ మొక్కను ఒకటి నాటాలి/ మొక్కే నీకు ఆధారం/ మొక్కే నీకు అవసరము’ అని రాస్తారు. ‘దేశం కోసం నిలబడతాం’ అని పిల్లల తరపున వకాల్తా తీసుకుని చెప్పిన చింతల శ్రీనివాస్‌ గుప్త నిజామాబాద్‌ నేల మీద బాల సాహిత్యపు కొత్త మొలక. ఇందూరు ఖిల్లా మీద ‘చిగురింతల’ గేయాల కేరింత.

– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

Spread the love