పెండ్లైన 24 గంటల్లో నవదంపతులు దారుణ హత్య…

నవతెలంగాణ – ఉత్తర్ ప్రదేశ్‌
పెండ్లైన 24 గంటల్లో నవదంపతులు సహా కుటుంబంలోని ఐదుగుర్ని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన యువకుడు.. అనంతరం తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్యంత ఘోరమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గోకుల్‌పుర్‌కు చెందిన శివవీర్‌ యాదవ్‌ (28) అనే యువకుడు. శనివారం రాత్రి ఇంటిలో నిద్రపోతున్న తన సోదరులు భుల్లన్‌ యాదవ్‌ (25), సోనూ యాదవ్‌(21), సోనూ భార్య సోనీ (20), బావ సౌరభ్‌ (23), స్నేహితుడు దీపక్‌ (20)లపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం భార్య డాలీ, మేనత్త సుష్మా యాదవ్‌లపై కూడా దాడి చేసి గాయపరిచారు. అనంతరం తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన శివవీర్‌ యాదవ్‌ మేనత్త, భార్యలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. సోనూ, సోనీల వివాహం గురువారం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు శివవీర్.. నొయిడాలో పనిచేస్తుంటాడని, పెళ్లి కోసం మూడు రోజుల కిందటే గోకుల్‌పుర్‌కు వచ్చాడని చెప్పారు. కుటుంబంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలియజేశారు. ఘటన గురించి సమాచారం అందడంతో తక్షణమే అక్కడకు చేరుకుని, గాయాలతో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అయితే, అప్పటికే ఐదుగురు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారని వివరించారు. హత్యలకు కుటుంబ వివాదాలే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్న పోలీసులు.. స్నేహితుడు దీపక్‌ను ఎందుకు చంపాడనేది స్పష్టతలేదని మెయిన్‌పురి ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

Spread the love