వంద పడకల ఆస్పత్రుల సంఖ్యను పెంచాలి

The number of 100-bed hospitals should be increased– అసెంబ్లీ జీరోఅవర్‌లో పలువురు సభ్యుల వినతి గ్రామపంచాయతీ కార్మికులు, వీఓఏలను పర్మినెంట్‌ చేయాలని వేడుకోలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఆయా జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేయాలని పలువురు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అసెంబ్లీ జీరో అవర్‌ సమయంలో జగిత్యాలలో 100 పడకలు, గంగాధరలో 50పడకల ఆస్పత్రులతోపాటు, డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు సుంకె రవిశంకర్‌ కోరారు. చొప్పదండి, కుదురుపాక, ఒడియాల మండలాల్లో సబ్‌స్టేషన్లు, కొండగట్టులో 108అబులెన్స్‌ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను 30 పడకల నుంచి 50 పడకలకు పెంచాలని, దొరవారి తిమ్మాపూర్‌లో చెక్‌డ్యామ్‌ను నిర్మించాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు శంకర్‌నాయక్‌ కోరారు. పాలేరులో 100 పడకల ఆస్పత్రి, కూసుమంచిలో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు ఉపేందర్‌రెడ్డి విన్నవించారు. వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు ఆరూరి రమేష్‌ కోరారు. కోదాడలో 30పడకల నుంచి 100పడకల ఆస్పత్రిగా మార్చాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు బొల్లం మల్లయ్యయాదవ్‌ సూచించారు. వైరాలో100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు రాములు నాయక్‌ కోరారు. ఇల్లంతకుంటలో 50పడకల ఆస్పత్రి. గన్నేవాగులో పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు రమసయి కోరారు. అయిజ మండలంలో 28 గ్రామాలు ఉన్నాయని, దీనిలో కొన్ని గ్రామాలతో మేడికోండ మండలాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు అబ్రహాం కోరారు. గోదావరి ప్రవాహంతో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాలు నీటమునుగు తున్నాయని, దీన్ని నివారించడానికి సుందిళ్ల బ్యాక్‌ వాటర్‌ రాకుండా కరకట్టను నిర్మించాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు కోరుకంటి చందర్‌ కోరారు.సింగరేణి కార్మికులకు స్వచ్ఛ నీటిని సరఫరా చేయడానికి పంప్‌హౌస్‌ను నిర్మించాలన్నారు. మానేరు, వీణవంక, కొనపర్తి వాగులతో పొలాల్లో ఇసుకమేటలు పేరుకుపోయాయని బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. భారీ గుంతలతో వ్యవసాయ భూములు పాడయ్యాయి. పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని కోరారు. వికలాంగు లకు ఇంటి వద్దకే పించన్‌ ఇచ్చేవిధంగా ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ సూచించారు. వృద్ధాప్య ఫించన్‌దారుల్లో భర్త చనిపోతే భార్యకు, భార్య మరణిస్తే భర్తకు బదిలీ చేయాలని కోరారు.
వారిని పర్మినెంట్‌ చేయాలి
గ్రామపంచాయతీ కార్మికులు, ఐకేపీ వీఓఏల సమస్యలను పరిశీలించి పర్మినెంట్‌ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు. జిల్లా, మండల సమాఖ్యలో పనిచేస్తున్న 1,542 మంది అకౌంటెంట్‌ల సమస్యలు పరిష్కరించాలి. వీఆర్‌ఏ కారుణ్య నియామకాల్లో సమస్యలను పరిష్కరించాలని శ్రీధర్‌బాబు కోరారు. మిషన్‌భగీరథలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు రావడంలేదని, ల్యాబ్‌ ఉద్యోగులు, కంప్యూటర్‌ ఆపరేటర్లను పరిశీలించి పర్మినెంట్‌ చేయాలని సండ్ర వెంకటవీ రయ్య సూచించారు. సాంస్కృతిక సారథి కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పీఆర్‌సీ వర్తింపచేయాలని రసమయి బాలకిషన్‌ కోరారు.
ఇంజినీరింగ్‌ కాలేజిని ఏర్పాటు చేయండి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న 200 ఎకరాల్లో పీజీ కాలేజీ, ప్రభుత్వం ఇంజినీరింగ్‌ కాలేజీ, ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. గ్రామపంచాయతీ కార్మికులు, వీఓఏ ఉద్యోగులను పరిశీలించి న్యాయం చేయాలని సూచించారు.
గ్రామీణ యువతకు న్యాయం చేయాలి
పోలీసు కానిస్టేబుల్‌ నియామకాల్లో గ్రామీణ యువతకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు గువ్వల బాలరాజు కోరారు. క్యాడర్‌-1లో హైదరాబాద్‌ వాళ్లకు, క్యాడర్‌-2లో గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు కేటాయించారని, దీంతో గ్రామీణప్రాంత యువకులు తీవ్రంగా నష్ట పోతున్నారని, దీన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన విన్నవించారు. ఇదే విషయంపై కాంగ్రెస్‌ సభ్యుడు దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పోలీసు నియామకాలకు సంబంధించిన జీఓ నెం.46తో గ్రామీణ యువతకు నష్టం జరుగుతున్నదని, దీన్ని సవరించాలని కోరారు.
పోడు పట్టాలు..ధరణి
హుజూరునగర్‌లో 7,373పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే 84 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారనిబీఆర్‌ఎస్‌ సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. మిగిలినవాటిని పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు. వీటితోపాటు మాన్యువల్‌గా చేసిన 1485దరఖాస్తులను సైతం పరిశీలించి పట్టాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ధరణిలో సమస్యలు ఉన్నాయని, భూమి రగ్భలో 10గంటల భూమి ఉంటే 20గుంటలు చూపిస్తున్నదని తహసీల్దార్‌ను అడిగితే కలెక్టర్‌కు రాశారని, కలెక్టర్‌ను కలిస్తే సీసీఎల్‌ఏకు రాశారని సభ్యుడు అంజయ్యయాదవ్‌ తెలిపారు. దీని కోసం రైతులు హైదరాబాద్‌కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తహసీల్దార్‌ స్థాయిలో పరిష్కారమయ్యేవిధంగా చూడాలని కోరారు. పట్టాభూమిని ధరణిలో దేవాదాయ భూములుగా నమోదు చేశారని, విరాసత్‌ విషయంలోనూ ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
డ్రగ్స్‌పై నియంత్రణేది?
పాతబస్తీలో డ్రగ్స్‌తో యువత చెడిపోతుందని ప్రతిపక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. డ్రగ్స్‌, గంజాయి, వైట్‌నర్‌, కాప్‌సిరఫ్‌ తీసుకుని మత్తులో మునిగితేలుతున్నారని, పోలీసుల పర్యవేక్షణ కరువైందన్నారు. స్కూల్‌, పాన్‌షాప్‌, పబ్స్‌, మెడికల్‌ షాపులపై నిఘా పెట్టాలని కోరారు. స్కూల్స్‌, జనావాసాలకు దగ్గర ఉన్న వైన్‌షాపులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.
గురుకుల యూనివర్సిటీ
తెలంగాణలో గురుకుల విద్యా సంస్థలు పెద్దఎత్తున ఉన్నాయని, స్కూల్‌, జూనియర్‌, డిగ్రీ కాలేజీలు మాత్రమే ఉన్నాయని రసమయి బాలకిషన్‌ తెలిపారు. వీటికి అనుబంధంగానే గురుకుల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నేదునూర్‌లో 450 ఎకరాల్లో జెన్‌కో గ్యాస్‌ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పిందని, కానీ ఇప్పటికీ చేయలేదన్నారు. దాని స్థానంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తే దళితులకు ఉపాధి అవకాశాలు వస్తాయని విన్నవించారు.
హైదరాబాద్‌ నగర సమస్యలు
కొత్త రేషన్‌కార్డులు దరఖాస్తులను స్వీకరించాలని మజ్లీస్‌పార్టీ సభ్యులు మోజంఖాన్‌ తెలిపారు. దానికి సంబంధించిన వెబ్‌సెట్‌ను ఓపెన్‌ చేయాలని, ఏడాది నుంచి షాదీముబారక్‌ దరఖాస్తులను పరిష్కరించడ ంలేదని తెలిపారు. జీఓనెం.118ని సవరించాలని సభ్యుడు కౌసర్‌మొహినుద్దీన్‌ తెలిపారు. ఖైరతాబాద్‌లో మంజూరు మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌కు సంబంధించిన భూమిని హెచ్‌ఎండీఏ నుంచి జీహెచ్‌ఎంసీకి మార్చాలని సభ్యుడు దానం నాగేందర్‌ కోరారు.
వాయిదా తీర్మానాల తిరస్కరణ
ఇండ్ల సమస్యల గురించి చర్చించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరస్కరించారు. దీంతోపాటు మల్లన్నసాగర్‌, ఇతర రిజర్వాయర్ల భూ నిర్వాసితుల సమస్యలపై దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్‌రావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సైతం తిరస్కరించారు.

Spread the love