పెరిగింది పడకల సంఖ్యే.. నర్సుల సంఖ్య కాదు..

– సర్కారీ దవాఖానాల తీరిది
– ప్రస్తుతమున్న నర్సులపై పనిభారం…
– రోగులకు సేవల్లోనూ ఇబ్బందులు
– ఖాళీలన్నీ భర్తీ చేస్తేనే ప్రయోజనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో పడకల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు 17 వేలున్న పడకలు దాదాపు రెట్టింపు కాగా వాటి సంఖ్యను 50 వేలకుపైగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లోనూ నమ్మకం పెరిగింది. ఆ మేరకు ఆస్పత్రుల సామర్థ్యాన్ని మించి రోగులు వస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకు తగినట్టుగా నర్సుల సంఖ్య మాత్రం పెరగకపోవడంతో రోగులకు సేవల్లో జాప్యం జరుగుతున్నది. సదుపాయాలు, సౌకర్యాలు, భవనాల నిర్మాణం, డాక్టర్ల నియామకం చేపడుతున్నా…. నర్సులందించాల్సిన సేవలు మాత్రం పూర్తి స్థాయిలో లేకపోవడం లోటుగా కనిపిస్తున్నది.
2014 నాటికి రాష్ట్రంలో 17 వేల పడకలుండగా మంజూరైన నర్సుల పోస్టులు 9,200 ఉండేవి. అంటే అప్పటికే దాదాపు నాలుగు వేల మంది విధులు నిర్వహిస్తుండగా, మరో ఐదు వేల వరకు ఖాళీలున్నాయి. 2017లో భర్తీ చేసిన నర్సుల పోస్టులతో కలిపి ఇన్‌సర్వీస్‌లో దాదాపు 6 వేల మంది పని చేస్తున్నారు. తాజాగా మరో 5,204 పోస్టులకు త్వరలో పరీక్ష నిర్వహించనుండగా, ఇటీవల 1827 పోస్టులను భర్తీ చేసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. కరోనా సమయంలో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకున్న నర్సుల్లో వెయ్యి మందికి పైగా తొలగించారు.
ప్రస్తుతం ఉన్న పడకలు, రోగులకు మెరుగైన సేవలందించాలంటే కనీసం 13 వేల మంది నుంచి 15 వేల మంది వరకు నర్సులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ, జిల్లా ఆస్పత్రుల స్థాయి అప్‌గ్రేడ్‌ తదితర వాటితో విస్తరించిన వైద్యసేవలకు అనుగుణంగా నర్సుల నియామకం చేపట్టకపోవడం ఇబ్బందులకు తావిస్తున్నట్టు తెలుస్తున్నది. నిలోఫర్‌ లాంటి ఆస్పత్రుల్లోనూ ప్రస్తుతం ఉన్న నర్సుల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో అవసరముంటారని తెలుస్తున్నది. మరోవైపు ఆస్పత్రి సేవలను విస్తరిస్తున్నారు. దీంతో అదనంగా నర్సుల సేవలూ అవసరమవుతాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో నిత్యం పడకల సంఖ్యకు మించి రోగులు వస్తుండటంతో ప్రస్తుత సిబ్బందిపై భారం పడుతున్నది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు 50 వేల పడకలకు విస్తరిస్తే కనీసం 18 వేల నుంచి 20 వేల మంది నర్సులు అవసరముంటాదని అంచనా.
శాశ్వత సేవలకు తాత్కాలిక సిబ్బంది….
ఖాళీ పోస్టులు భర్తీ చేసే వరకు ప్రభుత్వం కీలకమైన సేవల విభాగంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నర్సుల సేవలను ఉపయోగించుకుంటోంది. అయితే రెగ్యులర్‌ నర్సులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా సమాన పనికి సమాన వేతనం రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యసేవలనేవి శాశ్వత సేవలు. అదే రీతిలో నర్సులను కూడా శాశ్వత ప్రాతిపదికన సకాలంలో నియమించాలని నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌ నర్సుల పోస్టుల భర్తీకి పరీక్ష జరగనున్న నేపథ్యంలో తాత్కాలిక సిబ్బంది వాటి కోసం సిద్ధపడేందుకు ఎక్కువగా సెలవుల్లో ఉంటున్నట్టు సమాచారం. దీంతో ఆయా ఆస్పత్రుల్లో నర్సింగ్‌ సేవలకు మరింత విఘాతం కలుగుతున్నట్టు తెలిసింది. కొత్త ఆస్పత్రులు, పాత ఆస్పత్రుల విస్తరణ, పడకల సంఖ్య పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్న సమయంలోనే నియామక ప్రక్రియనుకూడా ప్రారంభిస్తే రోగులకు మరింత మెరుగ్గా సేవలందించే అవకాశముంది.

Spread the love