– ప్రాఫెట్ ఫర్ ద వరల్డ్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్లమెంటులో పేదల తరపున మాట్లాడేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన చెప్పారు. అందుకోసం ఒక మంచి మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరముందని సూచించారు. మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని రచించిన ‘ప్రాఫెట్ ఆఫ్ ద వరల్డ్’ పుస్తకావిష్కరణ సభను శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌లో నిర్వహించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు లభించిందని అన్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్… ఇలా మతగ్రంథాలన్నింటి సారాశం ప్రపంచశాంతి మాత్రమేనని వ్యాఖ్యానించారు. అందరూ కలిసి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటూ అవి సూచిస్తున్నాయని తెలిపారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందినవాడు కావటం గర్వకారణమని అన్నారు. గతంలో హైదరాబాద్‌కు ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ, మరోవైపు తానూ ఎంపీలుగా ఉన్నామని గుర్తు చేశారు. అసదుద్దీన్ గతంలో కొన్ని సార్లు కాంగ్రెస్‌పై కూడా విమర్శలు గుప్పించారంటూ చమత్కరించారు. మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే.. అదే రీతిలో మంచి ప్రతిపక్షం కూడా ఉండాలని బీఆర్‌ఎస్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు మాట్లాడాలనీ, ఆ తర్వాత నాలుగు నోట్ల రాష్ట్ర ప్రజల గురించి పార్టీలకతీతంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలో మజ్లిస్ పార్టీ ఇచ్చే సూచనలు, సలహాలను తమ ప్రభుత్వం స్వీకరిస్తోందని తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం ఆ పార్టీ సహకారాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో నిర్వాసితులయ్యే పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. గతంలో చంద్రబాబు, వైఎస్, కేసీఆర్‌లకు ప్రజలు రెండు దఫాలు పరిపాలించే అవకాశమిచ్చారని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే తరహాలో కాంగ్రెస్‌కు కూడా రెండోసారి అవకాశమిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తద్వారా పదేండ్లపాటు పేదల సంక్షేమం కోసం పాటుపడే అదృష్టాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.