దీపావళి పండగ వారం రోజుల ముందే ప్రజల నెత్తిపై ‘ఉల్లి’ బాంబు పడింది. మొన్నటివరకు టమాట ధర వింటేనే హడలెత్తిపోయే సామాన్యులు ఇప్పుడు ఉల్లి ధరల్ని చూసి ఆందోళన చెందాల్సిన పరిస్థితి. నిత్యం మన వంట కాల్లో ఉల్లి ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుంటుందో వేరే చెప్పనక్కర్లేదు. కానీ నేడు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఉల్లి మరికొన్ని రోజు ల్లో అందనంత ఎత్తుకు ఎగబాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పదిహేను రోజుల కిందట వంద రూపాయలకు ఆరేడు కిలోలు వచ్చే ఉల్లి నేడు కిలో అరవై రూపాయలు పలుకు తోంది. ఎందుకింత తేడా? కేంద్రం ఈ రెండు వారాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెంచే చర్యలు ఏమైనా తీసుకుందా? ఉల్లి ఒక్కటే కాదు నిత్యావసరాల ధరలు కూడా గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. అల్లం, వెల్లుల్లి చూస్తే కిలో రూ.రెండు వందలకు తక్కువ లేదు. బహిరంగ మార్కెట్లో ధరలు శరవేగంగా దూసుకుపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఈ ధరల పెరుగుదలకు, ఉల్లి కొరతకు కారణాలేంటి? ఇవన్నీ మన నేతలకు పట్టవు! ఎన్నికల హడావిడిలో పడి ఓట్ల కోసం పడుతున్న పాట్లలో ప్రజా సమస్యలు గాలికొదిలేసినట్టుంది?
దేశంలో అత్యధికంగా ఉల్లిని సాగుచేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే నాలుగింట మూడొంతుల ఉత్పత్తి జరు గుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా ప్రసిద్ధి గాంచిన మహారాష్ట్రతో పాటు కర్నాటకలోనూ అకాల వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిన్నది వాస్తవం. దీంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయని పరిస్థితి తలెత్తింది. అయితే ఈ పరిణామాలతో ధరల కట్టడికి ఉల్లి ఎగుమతులపై విధించే పన్నును నలభై శాతం మేర కేంద్రం పెంచింది. కానీ ప్రజ లకు ధరలు అందుబాటులో ఎందుకుండటం లేదనేది ప్రశ్న? రైతుల నుండి పంట సేకరణ చేస్తామని ప్రకటించిన కేంద్రం ఎందుకు అమలు చేయలేదు. దిగుబడులు సరిగా లేకపోవడం, మార్కెట్లో చాలినంత సరుకు రాకపోవడం, ఉన్న ఉల్లిని కూడా బడా వ్యాపారులు కొనుగోలు చేయడం తో ఉల్లి ధరలు బాగా పెరిగాయి. అక్టోబర్‌లో ఈ ధరలు పెరుగుతాయనే ఊహించే ఆగష్టు మధ్య నుండే ఉల్లిని కొనుగోలు చేసి 1.7లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేస్తున్నా మని, ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి సహకార సంస్థల ద్వారా రిటైల్ మార్కెట్లలో వినియోగదారులకు సబ్సిడీపై కిలో రూ.25కే ఉల్లిని అందుబాటులో ఉంచామని వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌సింగ్ చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు.
గతేడాదితో పోలిస్తే జూన్ వరకు ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఆగష్టులోనే 80శాతం పెరిగాయి. క్వింటాల్ ఉల్లి నేడు 3వేల నుంచి 4వేలు పలుకుతోంది. బడా వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేసి దేశంలోని పట్టణ ప్రాంతాలకు రవా ణా చేస్తారు. అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు చేర తాయి. ఇలా మధ్య దళారుల చేతిలో నుంచి వినియోగ దారుడి వద్దకు వచ్చేసరికి ధర అమాంతం పెరిగిపోతోంది. 2022-23లో దేశంలో 318లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ఉల్లి ఉత్పత్తి జరిగింది. శీతాకాలపు పంటలో దిగు బడులు బాగా ఎక్కువగా రావడంతో మార్చిలో హోల్ సేల్ మార్కెట్లలో కిలోకు ఒకటి, రెండు రూపాయల ధర మాత్రమే పలికింది. దీంతో చాలామంది పంటను పొలం లోనే వదిలేశారు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పు ల కారణంగా ఉల్లి ధర ఒక్కసారిగా పెరిగింది. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు పంటను దెబ్బతీశాయి. ఉల్లి ఎదగకముందే పండిపోయింది. ఆ తర్వాత అకాల వర్షాలు, గాలిలో తేమ పెరగడంతో పంటకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకాయి. దీంతో పంటను తొందరగా తీసే యడంతో రైతులు నష్టపోయారు. ఉత్పత్తి చేసిన పంటకు ధర తక్కువగా ఉండటం, మరో వైపు పూర్తిగా పంట నష్టపోవడంతో రైతులు ఆందోళనలకు కూడా దిగారు. అయినప్పటికీ కేంద్రం చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వారికి నష్ట పరిహారం కూడా చెల్లించలేదు.
ఉల్లి ధరలు పెరుగుతుండటం షరా మామూలే అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వాల అలసత్వమే దీనికి నిదర్శనం. ఇతర పంటల్ని ఎక్కువకాలం కోల్డ్‌స్టోరేజీల్లో నిలువ ఉంచినట్టు ఉల్లిని ఉంచడం కుదరదు. ఈ పంటను పది నెలలు మాత్రమే నిల్వ ఉంచగలం. ఆ తర్వాత మళ్లీ దాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెట్‌కు పంపు తారు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉల్లి ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో ఖరీఫ్ పంట నిల్వలు అయిపోతుం టాయి. తర్వాత సీజన్లో వేసే పంట అప్పటికీ చేతికి రాదు. కానీ ఈ కాలంలోనే ధరల్ని అదుపు లోకి ఉంచేందుకు ప్రభుత్వాలు ప్రయ త్నాలు చేయాలి. కానీ పెరిగిన ధరలను చూస్తే నియం త్రణకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. ఒకప్పుడు ఉల్లి ధరలు ప్రభుత్వాల్నే కూల్చిన సందర్భాలూ లేకపోలేదు. 2013లో ఢిల్లీ, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ఓటమికి ఉల్లి ధరల పెరుగుదలే కారణం. తాజాగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ఈ ఉల్లి ధరలు ఏం చేయనున్నాయో?