డాఫ్నెదు మారియార్ 1938 లో రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా రెబెకా. 1940లో ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డ్ పొందిన ఈ సినిమాను ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ దర్శకత్వం వహించారు. ఇది హిచ్కాక్ మొదటి అమెరికన్ సినీ ప్రొడక్షన్ కూడా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా మలచిన ఈ సినిమాలో రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి. సినిమాలో ప్రధాన పాత్ర రెబెకా సినిమా కథలో మొత్తం ఉంటూనే ఎక్కడా కనిపించదు. అలాగే తెరపై కనిపించే ప్రధాన పాత్ర పేరు ఎక్కడా వినిపించదు. ఈ శైలితో కథలో గొప్ప గాంభీర్యాన్ని జోడించారు రచయిత్రి. అదే సినిమాకు కూడా కొత్తదనాన్ని తీసుకొచ్చింది. థ్రిల్లర్ సినిమాల రారాజు హిచ్కాక్ ఈ సినిమాను మలచిన తీరూ అంతే గొప్పగా ఉంటుంది.
సినిమా ప్రారంభంలో చిత్ర నాయకుడు మాక్జిం దె వింటర్ ఎత్తైన కొండ మీద నుంచుని లోయలోకి చూస్తూ ఉంటాడు. కిందకు దూకాలనే అతని ఆలోచనను అతన్నే గమనిస్తున్న ఓ స్త్రీ అర్థం చేసుకుని, అతన్ని ఆపి, అక్కడి నుండి దూరం జరగమని అతన్ని కోరుతుంది. తాను చేస్తున్న తప్పు అర్ధమయి అది కప్పిపుచ్చుకోవడానికి ఆమెను తన పని తాను చేసుకొమ్మని బుకాయిస్తాడు అతను. అక్కడి నుండి తిరిగి వడివడిగా వెళ్లిపోతాడు. ఈ సంఘటన వారిద్దరి వ్యక్తిత్వాలను చూపుతుంది. వారే ఈ సినిమా హీరో హీరోయిన్లు.
మెల్లగా కథలోకి వెళితే తల్లిదండ్రులు లేని ఓ అనాధ ఓ ధనవంతురాలి వద్ద పనిచేస్తుంటుంది. పేద ఇంటికి చెందిన ఆమెలో అభద్రతా భావం వుంటుంది. ఈమెను ధనవంతుడైన మాక్జిం ప్రేమిస్తాడు. అతని వయసు నలభై పైగానే. అతని భార్య రెబెకా సంవత్సరం క్రితం మరణించిందని, ఆ దు:ఖంలో అతను మునిగి ఉన్నాడని యజమానురాలి ద్వారా ఈ పని మనిషికి తెలుస్తుంది. మొదటిసారి ప్రేమ అనే భావాన్ని అనుభవించిన ఆమె ఆతనికి దూరం కాలేకపోతుంది. యజమానురాలు హోటల్ ఖాళీచేసి వెళ్ళే సమయంలో తనని చివరిసారిగా కలిసిన ఆమెను మాక్జిం వివాహం చేసుకుంటానని చెబుతాడు. అదే రోజు ఓ రిజిస్టార్ ఆఫీసులో చట్టపరంగా ఆమెను భార్యగా స్వీకరిస్తాడు.
మాక్జిం మాండర్లీ అనే ఓ పెద్ద ఎస్టేట్ కు యజమాని. అక్కడకు చేరిన భార్యాభర్తల కొత్త జీవనం మొదలవుతుంది. పెద్ద ఇల్లు, ఆడంబర జీవితం.. ఇవన్నీ మిసెస్ దె వింటర్కు భయాన్ని కలిగిస్తాయి. ఆ ఇంటిని చూసుకునే పనిమనిషి మెసెస్ డెన్వర్స్ అంటే ఆమెకు భయం మొదలవుతుంది. ఇంట్లో ప్రతిచోట మాక్జిం మొదటి భార్య రెబెకా వస్తువులు కనిపిస్తుంటాయి. అక్కడ ఉన్నంత సేపు రెబెకా నీడలోనే తాను ఉన్నట్లు అనిపిస్తుంటుంది ఈ కొత్త భార్యకు. మిసెస్ డెన్వర్స్ ప్రవర్తన, కొత్త చోటు, అడంబర జీవితానికి అలవాటు పడలేని ఆమె నిస్సహాయత ఆమె రోజువారీ జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. మాక్జిం అక్కా బావలు ఆమెను మనస్పూర్తిగా స్వీకరించినా, వారు ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు కాదు. వారి ద్వారా రెబెకా మాక్జింల మధ్య ఎంతో ప్రేమ ఉండేది అని తెలుసుకుని మిసెస్ దె వింటర్ ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేకపోతుంది. మాటిమాటికి మారిపోయే భర్త ప్రవర్తన ఈ కొత్త భార్యను ఇంకా భయపెడతాయి.
మొదటి రోజే ఓ బొమ్మను పగులగొట్టి దాని ముక్కలు దాచిపెట్టి తనలోని భయాన్ని, అయోమయాన్ని బయటపెట్టుకుంటుంది మెసెస్ దె వింటర్. మెసెస్ డెన్వర్స్ నౌకరును ఆ బొమ్మ దొంగిలించిందని దండించే సమయంలో ఆ తప్పు తానే చేసానని మెసెస్ దె వింటర్ తల వంచుకుని చెబుతుంది. యజమానురాలి స్థానంలో ఉండి, పని మనిషి ముందు చిన్నబోయి కనిపించే ఆమె ఆ ఇంట్లో అధికారిగా మారలేదని ప్రేక్షకులకు అర్ధం అవుతుంది
భర్తను సంతోషపెట్టడానికి ఓ కాస్టూమ్ పార్టీని నిర్వహిస్తుంది మిసెస్ దె వింటర్. దాని కోసం తన దుస్తులను డిజైన్ చేసుకుంటున్న ఆమెకు మిసెస్ డెన్వర్ ఆ ఇంట్లో దె వింటర్ పూర్వీకుల ఫొటోలు చూపించి అందులో అందంగా ఉన్న ఓ స్త్రీ దుస్తులను చూపి, ఆమె అంటే దె వింటర్ కు ఎంతో గౌరవం అని అందుకని ఆమెలా అలంకరించుకొమ్మని సలహా ఇస్తుంది. దె వింటర్ ప్రేమను పూర్తిగా పొందాలనే తపనతో మిసెస్ దె వింటర్ అవే దుస్తులను కుట్టించుకుంటుంది. భర్తకు పూర్తిగా తయారయిన తరువాతే తాను కనిపించి, అతని కళ్ళలో తన పట్ల ప్రేమను చూడాలని ఆశిస్తుంది. అతిధులందరూ వచ్చే సమయానికి మేడ దిగి వచ్చిన ఆమెను చూసి దె వింటర్ కోపం తెచ్చుకుంటాడు. ఏం పని చేస్తున్నావ్ అని అరిచేస్తాడు. తానేం తప్పు చేసిందో అర్ధం కాదు కాని, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని ఆమెకు అర్ధం అవుతుంది. ఏడుస్తూ పైకి వెళ్లిన ఆమె మిసెస్ డెన్వర్తో తననెందుకు అవమానంపాలు చేసావని ప్రశ్నిస్తుంది. చనిపోయే కొన్ని రోజుల ముందు రెబెకా అదే దుస్తులను ధరించిందని మెసెస్ డెన్వర్ చెబుతూ, ఆ దుస్తులలో కొత్త భార్యను చూసి మాక్జిం భరించలేడని తనకు తెలుసని, కావాలని తాను ఆమెను ఇబ్బందికి గురి చేసానని చెబుతుంది. పైగా రెబెకా స్థానంలోకి ఎవరూ రాలేరని చెప్పడం తన ఉద్దేశం అని, ఆ కొత్త భార్య ఎప్పటికీ ఆమె స్థానాన్ని తీసుకోలేదని అది తాను ఒప్పుకోనని స్పష్టం చేస్తుంది.
రెండో అంతస్తులోని గది కిటికీ తెరిచి దు:ఖంతో ఉన్న మెసెస్ దె వింటర్ను ఆ కిటికీ నుండి దూకి చనిపొమ్మని, జీవించి ఉండడం దండగ అని ఆమె మనసుపై దెబ్బ కొడుతుంది మిసెస్ డెన్వర్. ఆమె మాటల ప్రభావంలో పడిపోతుంది మిసెస్ దె వింటర్. అంతలో అప్పుడే బైట కలకలం రేగుతుంది. ఓ ఓడ సముద్రంలో మునిగిపోయిందని, దాన్ని రక్షించే ప్రయత్నం జరుగుతుందని ప్రేక్షకులకు అర్ధం అవుతుంది. ఆ గొడవతో ఈ ప్రపంచంలోకి వచ్చిన మిసెస్ దె వింటర్. ఆ కిటికీ నుండి కిందకు దూకి పరిగెడుతుంది.
ఈ ఓడను రక్షించే క్రమంలో జాలర్లకు అంతకు ముందు మునిగిపోయిన ఓ చిన్న పడవ కనిపిస్తుంది. అది రెబెకా సొంత పడవ. అందులో ఆమె శవం కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రెబెకా కనిపించకుండా పోయిన కొన్ని రోజుల తరువాత ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ స్త్రీ శవాన్ని రెబెకాగా గుర్తు పట్టాడు ఆమె భర్త మాక్జిం. ఇప్పుడు రెబెకా పడవ అందులో ఆమె శవాన్ని వెలికి తీస్తారు సిబ్బంది. మాక్జిమ్ ప్రవర్తన పట్ల అందరిలో అనుమానం మొదలవుతుంది.
అందరికీ దూరంగా చిన్న ఔట్ హౌస్లో ఉన్న మాక్జిం దగ్గరకు మిసెస్ దె వింటర్ వెళుతుంది. అతన్ని నిజం చెప్పమని అడుగుతుంది. రెబెకా ఓ పెద్ద మోసగత్తె అని, ఆమె తనను ఎప్పుడూ ప్రేమించలేదని, కాని లోకం ముందు అద్భుతంగా నటించేదని, ఆమెకు మరొకరితో సంబంధం ఉండేదని, అది తనకు తెలుసని, ఆమె నటనను, ఆమె అసలు రూపాన్ని తాను తప్పక భరించాల్సి వచ్చిందని చెబుతాడు మాక్జిం. తాను ఊహించినట్లు మాక్జిం రెబెకా పట్ల పిచ్చి ప్రేమలో లేడని తెలిసి కొంత నిశ్చింత అనుభవిస్తుంది మెసెస్ దె వింటర్.
గతం గురించి చెబుతూ రెబెకా మరణించిన రోజు గురించి వివరిస్తాడు మాక్జిం. రెబెకా ఎవరి బిడ్డకో తల్లి అవబోతుందని, ఆ బిడ్డను తన బిడ్డగా పెంచి తన అస్థికి వారసుడిగా చేయబోయే ప్రయత్నంలో ఉందని ఆమె ద్వారానే విన్న మాక్జిం ఆమెతో ఆ రోజు వాదనకు దిగాడు. అప్పుడు ఇద్దరూ రెబెకా పడవలో సముద్రం మధ్యలో ఉన్నారు. రెబెకా పై పిచ్చి కోపంతో ఆమెను ఆ పడవలోంచి నెట్టేస్తాడు మాక్జిం. కింద పడి తలకు దెబ్బ తగలడంతో రెబెకా మరణిస్తుంది. భయంతో ఆ పడవను మునిగేలా చేస్తాడు మాక్జిం. ఎవరిదో శవం ఒడ్డుకు కొట్టుకువస్తే, అది గుర్తు పట్టలేని స్థితిలో ఉంటే అది రెబెకాది అని చెప్పి ఆమె కథకు ముగింపు పలుకుతాడు మాక్జిం. ఇప్పుడు పడవలో కనిపించిన ఆమె అసలు శవం తనను దోషిగా నిరూపిస్తుందని చెప్పి తల్లడిల్లిపోతాడు. తాను మిసెస్ దె వింటర్ను తప్ప మరెవ్వరినీ అంత గాఢంగా ప్రేమించలేదని, రెబెకాతో వివాహం ఓ పెద్ద తప్పిదం అని, నిత్యం ఆమె సాంగత్యంలో తాను నరకం అనుభవించానని అతను తన కొత్త భార్యతో చెప్పుకుంటాడు.
కేసు కోర్టుకు వస్తుంది. రెబెకా సోదరుడినని చెప్పుకునే ఓ వ్యక్తి మాక్జింను నేరస్తుడిగా నిరూపించడానికి యత్నిస్తాడు. అతనితోనే రెబెకాకు అక్రమ సంబంధం ఉండేదని మాక్జిం ద్వారా మిసెస్ దె వింటర్ తెలుసుకుంటుంది. కోర్టులో రెబెకా ఆత్మహత్య చేసుకుందేమో అన్న ప్రస్తావన వస్తుంది. కాని ఆమె అంత పిరికిది కాదని, అప్పుడు ఆమె తల్లి కాబోతుందని చెబుతాడు రెబెకా ప్రియుడు. మిసెస్ డెన్వర్స్ ద్వారా రెబెకా చాటుగా కలిసే ఓ డాక్టర్ అడ్రస్ సంపాదిస్తారు అందరూ. నిజం తెలుసుకోవడానికి డాక్టర్ని కలుస్తారు. రెబెకా కాన్సర్తో భాధపడుతుందని, ఆమె కొన్ని నెలను మాత్రమే జీవిస్తుందని, ఆ క్రమంలో ఎంతో బాధ అనుభవించాల్సి ఉంటుందని తాను చెప్పానని ఆ డాక్టర్ వాళ్లకు చెబుతాడు. పైగా ఆమె ఎప్పటికీ తల్లి కాలేదని, ఇది ఆమెకు కూడా తెలుసని, అందువలన చనిపోయే సమయంలో ఆమె గర్భవతి అయే ప్రసక్తే లేదని కూడా చెప్తాడు.
రెబెకా జీవితంలో ఎవరికీ భయపడని స్త్రీ. ఆమె కేవలం అనారోగ్యానికి మాత్రమే భయపడే మనిషని అందుకే తనకు మరణం, శారీరక బాధ తప్పవని తెలిసి మాక్జింను రెచ్చగొట్టి అతని చేతిలో సులువుగా మరణించాలని ఆమె కోరుకుందని మాక్జింకి అర్ధమవుతుంది. అతనితో తాను గర్భవతిని అని చెప్పి అతనికి కోపం తెప్పించిందని మాక్జిం తెలుసుకుంటాడు. డాక్టర్ చెప్పిన సాక్షంతో రెబెకాది ఆత్మహత్య అని నిర్ధారిస్తాడు న్యాయమూర్తి.
కేసు అయిపోయిన వెంటనే మాక్జింలో ఓ భయం ఏర్పడుతుంది. త్వరగా తన ఎస్టేట్ కు చేరతాడు. కాని రెబెకా లేని ఇంట్లో మరో స్త్రీ ఉండకూడదని నిర్దారించుకున్న మిసెస్ డెన్వర్స్ ఆ భవనానికి నిప్పంటిస్తుంది. ఇంటి నుండి అందరూ బైటికి వచ్చినా ఆమె రాకుండా ఆ మంటల్లో రెబెకా జ్ఞాపకాల మధ్య కాలిపోతుంది. ఆమెతో పాటు రెబెకా ఉనికి, మాండర్లీ ఎస్టేట్ మొత్తం బూడిదవుతాయి.
ఈ సినిమాలో పాత్రల చిత్రీకరణ పట్ల ఇప్పటి తరానికి లోతుగా ఆలోచిస్తే కొని అభ్యంతరాలు ఉంటాయి. ముఖ్యంగా సినిమాలో ఎక్కడా తన పేరు ప్రస్తావన రాని మిసెస్ దె వింటర్, భర్తకు పూర్తిగా లొంగి ఉండే భార్యగా కనిపిస్తుంది. ఆమెకంటూ సొంత వ్యక్తిత్వం ఉండదు. ఆమెను పెళ్ళి చేసుకునేటప్పుడు మాక్జిం అధికారిగా ప్రవర్తిస్తాడు. ఆమె దాన్ని ప్రేమగా స్వీకరిస్తుంది. దీనికి వ్యతిరేకంగా రెబెకా తన ఉనికి బలంగా చాటుకునే స్త్రీ. దేనికీ భయపడదు, లొంగదు. ప్రతి పని, ప్రతి విషయం ఓ స్టైల్ మెయింటెన్ చేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఆమెను ఎవరూ మర్చిపోలేరు. భర్తను ప్రేమించకపోయినా ఆ ఇంట్లో తన అధికారాన్ని సుస్తిరం చేసుకుంటుంది. మిసెస్ డెన్వర్ ఆమెను పిచ్చిగా ఆరాధిస్తుంది. ఆమె స్థానంలో వ్యక్తిత్వం లేని మరో స్త్రీని ఆమె భరించలేకపోతుంది. రెబెకా తాను అనుకున్నట్లు జీవించి అలాగే మరణించి తన ఆధిపత్యాన్ని చాటుకుంటే, భర్తను తన వానిగా చేసుకోవాలని నిత్యం తపిస్తూ, కుచించుకుపోయిన వ్యక్తిత్వంతో పూర్తి లొంగుబాటుతో కనిపిస్తుంది ఆ కొత్త భార్య. పైగా ఎక్కడా ఆమె పేరు ప్రస్తావనకు రాదు. మిసెస్ దె వింటర్గా ఆ ఇంట అడుగుపెట్టిన రెబెకా ఆ ఇంటి ప్రతి మూల తన పేరు ఉండేలా చూసుకుని రెబెకాగా మిగిలిపోయి ఆమె మరణించిన సంవత్సరం తరువాత కూడా ఆ స్థానాన్ని అలాగే సుస్థిరం చేసుకోగల ధీటైన స్త్రీ. రెండో మెసెస్ దె వింటర్ పేరు ఎవరికీ తెలీదు. భర్త ప్రేమ పట్ల కూడా ఆమెకు నమ్మకం లేదు. భయం భయంగా భర్త కరుణకోసం ఎదురు చూస్తూ బతుకుతుంది. రెబెకా మరణించినా, ఆమె వివాహేతర సంబంధం గురించి విన్నా ఆమె పట్ల మరో కోణంలో ఓ రకమైన ఇష్టం కూడా కలుగుతుంది ప్రేక్షకులకు. తనదైన వ్యక్తిత్వంతో తనకు నచ్చినట్లుగా జీవించిన రెబెకాలోని ఆ మొండితనం, ధైర్యం ఆకర్షిస్తాయి మనల్ని.
రెండవ మిసెస్ దె వింటర్గా నటించిన నటి జొయాన్ ఫాంటెన్. ఈమె నటన, శరీర భాష ఆ పాత్రకు ఎంతో అర్ధానిచ్చాయి. ఒంగిపోయిన భుజాలతో కళ్ళల్లో భయంతో, లేడిపిల్లగా చిన్న అలికిడిగే కలవరపడిపోతూ సినిమా అంతా రెబెకా ఎవరో తెలియకుండానే లొంగిపోతూ కనిపిస్తుంది ఈమె. భర్త రెబెకాను ప్రేమించలేదని తెలిసినప్పుడే ఆమె కళ్ళలో కొంత ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. కొంచెం ఒంగి ఉండే ఆమె వెన్ను, ఆ చేతుల కదలికలతో ఆ పాత్రలోని అభద్రతా భావాన్ని ప్రతి సీన్లో ఆమె అద్భుతంగా పండించగలిగింది. ఆమె నటన కారణంగా అసలు స్క్రీన్ పై కనిపించని రెబెకా వ్యక్తిత్వం ఉన్నతంగా కనిపిస్తుంది ప్రేక్షకులకు. అంటే తన పాత్రకు న్యాయం చేస్తూ కనిపించని ఆ మరో పాత్రను కూడా ప్రేక్షకులు తాను ప్రదర్శిస్తున్న వ్యక్తిత్వానికి భిన్నంగా ఊహించుకోగలిగేలా అద్భుతంగా నటించారు ఆమె. అంటే కనిపించే పాత్రను, కనిపించని పాత్రనూ ఒకేసారి పోషించగలిగారు జొయాన్.
నవలలో రెబెకాను హత్య చేస్తాడు మాక్జిం. చివరకు అది ఆత్మహత్యగా నిరూపించి బైటపడతాడు. సినిమా కోసం అది ఓ ప్రమాదకర మరణంగా మార్చి హీరో పాత్రలోని ఆ మచ్చను తుడిచేశారు దర్శకుడు. రెబెకా వివాహేతర సంబంధం గురించి ప్రస్తావన ఉన్నా, ఆమె మంచి భార్య కాదు అన్న వివరణ చివరలో వచ్చినా ఈ సినిమాలో ఆ పాత్ర ఆకర్షణ నుండి ప్రేక్షకులు తప్పించుకోలేరన్నది వాస్తవం. మాక్జింగా నటించిన లారెన్స్ ఆలివర్, అలనాటి గొప్ప నటులలో ఒకరు. స్వతహాగా స్టేజ్ యాక్టర్ అయిన ఈయన సంభాషణలు పలికే తీరులో గొప్ప స్పష్టత ఉంది. ధనవంతుడైన ఎస్టేట్ యజమానిగా సరిగ్గా సరిపోయారాయన. రెబెకాకు విరుద్దమైన వ్యక్తిత్వంతో ఉన్న స్త్రీని కోరుకుని ఆమె అధికారిగా మారి సాధారణంగా పురుషులు స్త్రీ నుంచి ఆశించే ప్రేమను మాక్జిం పాత్ర ద్వారా చక్కగా వ్యక్తీకరించగలిగారు. ఇక మిసెస్ డెన్వర్ శరీర భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే. అతి మర్యాద సంభాషణతో, ఒక రకమైన గంభీర్యంతో, రహస్యాత్మకతను జోడిస్తూ ఆమె చూసే చూపులు భయాన్ని కలిగిస్తాయి. ఈ పాత్రను ఆస్ట్రేలియన్ నటి జూడిత్ ఆండర్సన్ అద్భుతంగా పోషించారు.
హిచ్ కాక్ తన ప్రతి సినిమాలో ఓ సీన్లో సరదాగా కనిపిస్తారు. ఇది ఆయన అభిమానులకు తెలుసు. అందుకే ప్రతి సినిమాలో జాగ్రత్తగా ఆయన ఎక్కడ కనిపిస్తారో అని వెతుక్కుంటారు వాళ్లు. ఈ సినిమాలో రెబెకా ప్రియుడు ఫావెల్ ఓ టేలిఫోన్ బూత్ దగ్గర మిసెస్ డెన్వర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఓ పోలీస్ అతనితో కార్ తప్పుగా పార్క్ చేశావని చెబుతాడు. అక్కడ వారిద్దరి సంభాషణ నడుస్తుండగా ఓ లాంగ్ కోట్ వేసుకున్న వ్యక్తి ప్రేక్షకులకు వీపు చూపుతూ వారి వెనుక నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అతనే హిచ్కాక్. అతని అభిమానులు ఇలాంటి హిచ్కాక్ కామియోలను పట్టుకుని ఆనందిస్తూ ఉంటారు.
రెబెకాకు పదకొండు అకాడమీ నామినేషన్లు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాలలో మాత్రమే అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. 2018లో, ఈ చిత్రం యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ద్వారా ‘సాంస్కతికంగా, చారిత్రాత్మకంగా లేదా సౌందర్యపరంగా ముఖ్యమైన చిత్రంగా’ ఎంపిక చేయబడింది.
– పి.జ్యోతి,
98853 84740