– మోడీకి సవాలు విసురుతున్న ప్రతిపక్షం
– అప్పటి ఆటలు సాగబోవని స్పష్టీకరణ
– లోక్‌సభ సమావేశాల కోసం అస్త్రశస్త్రాలతో సిద్ధం
– కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం
పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, పది సంవత్సరాలు ప్రధానిగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన నరేంద్ర మోడీ ఇప్పుడు తొలిసారిగా రాజకీయాల్లో పోటీని ఎదుర్కోక తప్పడం లేదు. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న 18వ లోక్‌సభ సమావేశాల్లో ఆయనకు ఈ పోటీ ఎదురు కాబోతోంది. మిత్రపక్షాల పుణ్యమా అని దిగువ సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉన్నప్పటికీ సమధికోత్సాహంతో ఉన్న ఇండియా కూటమి మోడీ ప్రభుత్వాన్ని ఢకొీనడానికిి సిద్ధమవుతోంది. గతంలో గుజరాత్ శాసనసభలో కానీ లేదా దేశ రాజధానిలో కానీ మోడీ, ఆయన నేతృత్వంలోని బీజేపీ ఎన్నడూ ఇలాంటి సవాలును రుచి చూడలేదు.
న్యూఢిల్లీ : గత డిసెంబరులో 146 మంది ప్రతిపక్ష సభ్యులను మూకుమ్మడిగా ఉభయ సభల నుండి సస్పెండ్ చేసో లేదా బహిష్కరించో వారి గొంతుకలను అణచివేశారు. కానీ ఇప్పుడది సాధ్యం కాదు. గతంలో పార్లమెంటులో ప్రతిపక్షాలను లేకుండా చేసి అనేక కీలకమైన బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకున్నారు. క్రిమినల్ చట్టాలే దీనికి ఉదాహరణ. ఇప్పుడు ఆ మూడు క్రిమినల్ చట్టాలు వచ్చే నెల 1వ తేదీ నుండి అమలులోకి రాబోతున్నాయి. ఇకపై ఆ ఆటలు సాగబోవని ఇండియా కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు.
గత పది సంవత్సరాల మోడీ హయాంలో రైతుల ఉద్యమం మినహా అనేక ఆందోళనలు, నిరసనలు విజయం సాధించలేకపోయాయి. వాటన్నింటినీ కేంద్రం ఉక్కుపాదంతో అణచివేసింది. ఇప్పుడు ప్రతిపక్షాలు బలం పుంజుకోవడంతో అలాంటి ఏకపక్ష చర్యలు సాధ్యం కాకపోవచ్చు. ఈ సంవత్సరం చివరలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లోనూ, వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలోనూ, సెప్టెంబరులో బీహార్‌లోనూ జరగబోయే శాసనసభ ఎన్నికలు మోడీకి అగ్నిపరీక్షగా నిలవబోతున్నాయి. మోడీ ప్రతిష్ట మసకబారుతున్న నేథ్యంలో ఈ ఎన్నికలు బీజేపీకి కీలకం కాబోతున్నాయి.
ఆ మాట నిజమే
ఇకపై అన్ని బిల్లులను పూర్తిగా కూలంకషంగా చర్చించిన తర్వాతే ఓటింగుకు పెట్టాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీలు కూడా నూతన జవసత్వాలు సంతరించుకోబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నూతన స్పీకర్ నిర్వహించే పాత్ర ఎంతో కీలకమని అర్థమవుతోంది. బీజేపీకి సులభంగా, భారీ మెజారిటీ లభిస్తుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వేసిన అంచనా తప్పింది. అయితే ఆయన వేసిన మరో అంచనా నిజం కాబోతోంది. బీజేపీకి భారీ ఆధిక్యత లభించినప్పటికీ ప్రతిపక్షం నుండి తీవ్రమైన వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
ఆ మూడు అంశాలపై నిలదీస్తాం
ప్రతిపక్షాలు ఇప్పటికే తమ కత్తులకు పదును పెడుతున్నాయి. పరీక్ష పత్రాల లీకేజీలు, అగ్నిపథ్ పథకం, మణిపూర్ హింస…ఈ మూడు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే సూచనప్రాయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందే అగ్నిపథ్ కార్యక్రమాన్ని సమీక్షించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ పథకాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడం మినహా తమకు ఏదీ సమ్మతం కాదని ప్రతిపక్షం స్పష్టం చేస్తోంది. ఇక పరీక్ష పత్రాల లీకేజీపై విద్యా శాఖ ఇప్పటికే వెనక్కి తగ్గింది. బాధ్యతను అంగీకరిస్తూ సమీక్షలు, విచారణలకు ఆదేశించింది.
మణిపూర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో కన్పించింది. రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మాత్రం తన వైఫల్యాన్ని అంగీకరించడం లేదు. కానీ మోడీ ప్రభుత్వం ఇకపై ఆ రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
రాజ్యసభలోనూ సవాళ్లు తప్పవా ?
ఇక రాజ్యసభలోనూ బీజేపీకి సవాళ్లు తప్పేలా లేవు. అయితే అవి లోక్‌సభలో ఉన్నంత తీవ్రంగా మాత్రం ఉండకపోవచ్చు. ఇప్పటి వరకూ పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్సీపీ, ఒడిషాకు చెందిన బీజేడీ పార్టీలు బీజేపీకి అవసరం వచ్చినప్పుడల్లా మద్దతు ఇచ్చాయి. వివాదాస్పద బిల్లుల ఆమోదానికి సహకరించాయి. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తే సమర్ధిం చాయి. అయితే ఇకపై ఆ పరిస్థితులు ఉండబోవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పుడు ఎన్డీఏ భాగస్వాములు. ఒడిషాలో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేసింది. నిన్నటి వరకూ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా బీజేపీ వాటి మద్దతు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. బీజేపీ లేదా దాని మిత్రపక్షాల చేతిలో ఆ పార్టీలు ఓటమి చెందిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణలు మారిపోయాయి.
ప్రతిపక్ష నేత పదవిని స్వీకరిస్తే…
ఇప్పుడు పార్లమెంట్ విషయానికి వద్దాం. ప్రతిపక్ష నేత పదవిని చేపట్టడానికి రాహుల్ గాంధీ అంగీకరిస్తే కీలక పదవుల్లో నియామకాలకు సంబంధించి ఆయనకు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయి. ప్రధాని సరసన కూర్చొని ఆయా అధికారుల ఎంపికలో భాగస్వామి కావచ్చు. సీబీఐ, కేంద్ర విజిలెన్స్ కమిషన్, ఎన్నికల కమిషన్ సహా పలు పదవులకు సంబంధించిన నియామకాల్లో ఆయన మాటకు విలువ ఉంటుంది. మోడీతో కలిసి టీ తాగే అవకాశమూ లభిస్తుంది.