తమిళనాడు స్పీకర్‌కు లీగల్‌ నోటీసు పంపిన ప్రతిపక్షం..

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు స్పీకర్‌ ఎం అప్పావుకు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే లీగల్‌ నోటీసు పంపింది. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి క్షమాపణ చెప్పడంతోపాటు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో స్పీకర్‌పై సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తామని ఆ నోటీసులో హెచ్చరించింది. అధికార డీఎంకే పార్టీ నేత, అసెంబ్లీ స్పీకర్‌ ఎం అప్పావు ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో రాజకీయ గందరగోళం నెలకొందని విమర్శించారు. ఈ నేపథ్యంలో 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డీఎంకేలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాగా, స్పీకర్‌ ఎం అప్పావు చేసిన ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే న్యాయ విభాగం జాయింట్ సెక్రటరీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌ఎం బాబు మురుగవేల్ స్పందించారు. అన్నాడీఎంకే, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పరువు నష్టం కలిగించేలా స్పీకర్‌ అప్పావు నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనకు లీగల్‌ నోటీస్‌ పంపినట్లు తెలిపారు. నోటీస్‌ అందుకున్న 48 గంటల్లోగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్నాడీఎంకేకు క్షమాపణలు చెప్పడంతోపాటు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనపై సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపడతామని ఆ నోటీసులో పేర్కొన్నారు.

Spread the love