– లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసంగం …
– అడ్డుకున్న ప్రతిపక్షాలు
– ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఆసాంతం కొనసాగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం లోక్‌సభలో బదులిస్తూ దాదాపు 2.10 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రసంగంలో కనీసం దేశంలోని కీలక అంశాలనూ ప్రస్తావించలేదు. దీంతో ప్రధాని ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. నీట్, మణిపూర్, అగ్నిపథ్ వంటి ప్రజా సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని అన్నారు. ప్రజలు తమ పాలన, ట్రాక్ రికార్డు చూశారని తెలిపారు. తమ పదేండ్ల హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయట పడ్డారని అన్నారు. అవినీతిని ఏమాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ దశాబ్దంలో భారత్ ఖ్యాతి పెరిగిందని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని స్పష్టం చేశారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. లౌకికవాదం అంటే సామాజిక న్యాయం పాటించడమని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు తమపై భరోసా ఉంచారని అన్నారు. వికసిత్ భారత్‌తో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. తమ ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరుతున్నా యని చెప్పారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నా పత్రాల లీకేజీల విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నా మని అన్నారు. నీట్ ప్రశ్నా పత్రం లీక్ చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటా మన్నారు. ఓబీసీ వర్గాలను కాంగ్రెస్ దొంగలుగా చిత్రీకరిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలు హిందువుల మనోభావాలను కించపరిచాయని అన్నారు.
ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలు
ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని విపక్షాల నిరసనల మధ్యే కొనసాగించారు. మణిపూర్, నీట్ అంశాలపై మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మోడీ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డు తగిలారు. వారిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వారించారు. సభ్యులను వెల్‌లోకి పంపేలా ప్రతిపక్ష నేతలు వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా ప్రధాని మోడీ మాట్లాడటంతో ఆయన మాట్లాడినంత సేపు మణిపూర్ మణిపూర్ అంటూ వారు నినాదాలు హౌరెత్తించారు.
ఏపీ ప్రస్తావన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి క్వీన్ స్వీప్ చేసిందని పేర్కొన్నారు.
నిరవధిక వాయిదా
539 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం
లోక్‌సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ బదులిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. జూన్ 24న ప్రారంభమైన 18వ లోక్‌సభ తొలి సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. ఈ సమా వేశాల్లో నీట్ వివాదం, మణిపూర్ అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మోడీ సర్కార్ లక్ష్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలను స్పీకర్ ఆదేశాలతో రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించడం పెను దుమారం రేపింది. తన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభించగా, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తొలి సమాధానం ఇచ్చారు.
వివిధ పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు మాట్లాడారు. 18 గంటల పాటు తీర్మానంపై చర్చ జరిగింది. మొత్తం సభ ఏడు రోజుల పాటు జరగగా, 34 గంటల పాటు జరిగింది. 103 శాతం ఉత్పదకత నమోదు అయినట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
నూతన సభ్యుల ప్రమాణం
ఈ సెషన్‌లో తొలుత ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో ప్రమాణం చేయించారు. జూన్ 24న లోక్‌సభ ప్రారంభం కాగా 24, 25 తేదీల్లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల్లో 539 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండో సారి ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రి వర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే రోజు రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్షనేతగా నియమితులైనట్లు సభలో ప్రకటించారు.
80 సీట్లు గెలిచినా.. ఈవీఎంలను నమ్మను: అఖిలేశ్ యాదవ్
ఈవీఎంలను తమ పార్టీ నమ్మదని, ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 80 స్థానాలను తమ పార్టీ గెలిచినా నమ్మదని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ ఈవీఎంలను తొలగించే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు.
ఎన్నికల వల్ల వర్గ రాజకీయాలకు తెరపడిందని తెలిపారు. తాజా ఫలితాలు ఇండియా కూటమికి బాధ్యతను అప్పగించాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం.. ఇండియా కూటమికి నైతిక విజయాన్ని అందించిందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని మోదీ సర్కారుకు లేదని, అందుకే పేపర్ లీకేజీలు అవుతున్నట్లు ఆయన ఆరోపించారు. కుల గణన చేపట్టకుండా న్యాయం అందించలేమన్నారు. ఎన్నికల వేళ కొందరి పట్ల ప్రవర్తనా నియమావళి విషయంలో ఎన్నికల సంఘం ఉదాసీనంగా ఉన్నట్లు తెలిపారు.