– బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసన
– ఇబ్రహీంపట్నంలో కుటుంబ సభ్యులతో కలిసి రాస్తారోకో
– పోలీసులు వారిని పంపించే యత్నం చేయగా తోపులాట
– పలువురి అరెస్టు, స్టేషన్‌కు తరలింపు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి/ వరంగల్
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు ఆందోళనలు చేస్తుండగా.. శనివారం కానిస్టేబుళ్లు కూడా నిరసన బాట పట్టారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆందోళన చేశారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ సభ్యులతో కలిసి కానిస్టేబుళ్లు రాస్తారోకో చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే యత్నం చేయగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.బెటాలియన్‌లో పని చేసే కానిస్టేబుళ్ల స్వేచ్ఛను హరించే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా పరిధిలోని 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో నిరసన తెలిపారు. పోలీస్ అమరవీరుల వారసులను పురస్కరించుకొని నిర్వహించాల్సిన బైక్ ర్యాలీని రద్దుచేసి బెటాలియన్ లోపల నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రపవర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బెటాలియన్ ఉద్యోగం అంటే మానసిక ప్రశాంతత కోల్పోతున్నామని, ఒకరోజు తప్పించి ఒక రోజు విధులు నిర్వహించే విధంగా నిబంధనలు తేవాలని, ఎస్పీకి అటాచ్ చేయాలని కానిస్టేబుళ్లు కోరారు. కుటుంబాలకు, తమ పిల్లలకు సమయం ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెటాలియన్ కానిస్టేబుల్స్ సమస్యలను సావధానంగా విన్న ఎస్పీ డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.వరంగల్ జిల్లాలోని మామునూరు ఫోర్త్ బెటాలియన్ కమాండెంట్ కార్యాలయం ముందు కానిస్టేబుళ్లు బైటాయించి ధర్నా చేశారు. ఇటీవల కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన సంగతి విదితమే. శనివారం కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా ఆందోళనలకు దిగారు.