పద్దేమిదేండ్ల వయసులోనే పోరాట బాట

పద్దేమిదేండ్ల వయసులోనే
పోరాట బాట– ప్రజా సంక్షేమం కోసమే పోటీ
– అమరవీరుల పోరాట వారసత్వం సీపీఐ(ఎం) భద్రాచలం అభ్యర్థి కారం పుల్లయ్య
అమరవీరుల స్ఫూర్తితో పద్దేమిదేండ్ల వయసులోనే బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తున్నట్టు సీపీఐ(ఎం) భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. యలమంచిలి సీతారామయ్య, బండారు చందర్రావు స్ఫూర్తితో ప్రజాసంఘాల్లో పని చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం గిరిజన సంఘం బాధ్యతలను చూస్తూనే సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా గిరిజన, గిరిజనేతరులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. ఆయన మాటల్లోనే..
ప్రధాన పోరాటాలు, ఎదుర్కొన్న నిర్బంధాలపై..
పోలవరం ఎత్తు తగ్గించాలని పార్టీ నిర్వహించిన పోరాటంలో భాగస్వామినయ్యాను. 25 రోజులపాటు జైలు జీవితాన్ని గడిపాను. పోడు భూములకు పట్టాల కోసం జరిగిన పోరాటంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నాను. గిరిజన, గిరిజనేతర, ఇతర పేదల కోసం జరిగిన ఇండ్ల స్థలాల పోరాటాలు, సంక్షేమ పథకాల పోరాటాలకు నాయకత్వం వహించి అనేకసార్లు పోలీస్‌ లాఠీ దెబ్బలతో పాటు పలు కేసులు ఎదుర్కొన్నాను. కరోనా కాలంలో దుమ్ముగూడెం మండలంలో యలమంచిలి సీతారామయ్య ట్రస్టు పేరుతో వందలాది కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు వైద్య సదుపాయాలను అందించాం. బండారు చందర్రావు ట్రస్టు పేరుతో భద్రాచలంలో ఐసోలేషన్‌ కేంద్రం నిర్వహిస్తూ 300 మంది కరోనా రోగులకు వైద్యం అందించడంలో భాగస్వామినయ్యాను. ఎస్‌టీ, ఎస్‌సీ సబ్‌ ప్లాన్‌ నిధులు విడుదల చేయాలని నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్‌ యాత్ర నిర్వహించాను.
భద్రాచల నియోజకవర్గ ప్రధాన సమస్యలు..?
భద్రాచలం పట్టణాన్ని గోదావరి ముంపు నుంచి కాపాడేందుకు కరకట్ట ఎత్తు పొడవు పెంచడం, ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు కృషి చేస్తాను. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో ఖాళీ పోస్టుల భర్తీ, ఏజెన్సీలో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు పనిచేస్తా. వలస ఆదివాసీలకు గుర్తింపుతో పాటు మిగిలి ఉన్న పోడు భూములకు పట్టాలు, తునికాకు కార్మికులకు బోనస్‌, ఆదివాసీలందరికీ ఇంటి స్థలంతో పాటు సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం. ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పోరాడుతాను. భవన నిర్మాణ కార్మికులకు ప్రతిరోజు పని దొరికేందుకు ఇసుక అందుబాటులోకి తీసుకురావడం కోసం పనిచేస్తాను.
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులపై..?
భద్రాచలం నియోజకవర్గంలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌ పార్టీ. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోడెం వీరయ్యపై అవినీతి ఆరోపణలున్నాయి. దళిత బంధు లబ్దిదారుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేయడంతో పాటు ఇతర సంక్షేమ పథకాల్లో కూడా చేతివాటం ప్రదర్శించారని వార్తలు వచ్చాయి. భద్రాచలానికి ఆయన అతిధి ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. ఏ సమస్యపైనా ప్రభుత్వంపై పోరాడిన సాధించిన సందర్భాలు కూడా లేవు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న తెల్లం వెంకట్రావు సైతం సంవత్సరానికి ఒక పార్టీ మారుతూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. అరాచకవాదులను తమ పార్టీలో చేర్చుకొని నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆయనకు ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు.
30న జరిగే ఎన్నికల ఫలితాలపై మీ అంచనా..?
కచ్చితంగా ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) గెలిచి తీరుతుందన్న విశ్వాసం ఉంది. ప్రస్తుత భద్రాచల అభివృద్ధి మొత్తం సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు కుంజా బొజ్జి, ముర ఎర్రయ్య రెడ్డి, సున్నం రాజయ్య, మిడియం బాబురావు ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు సీపీఐ(ఎం) అధికారంలో లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. పార్టీ కార్యకర్తలే, నియోజవర్గ ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచి భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తా.

Spread the love