హర్యానా ప్రజలు కాంగ్రెస్‌ సర్కార్‌కు పట్టం కట్టనున్నారు : మాజీ సీఎం

నవతెలంగాణ-హైదరాబాద్ : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హర్యానా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడా పేర్కొన్నారు. హర్యానా ప్రజలు కాషాయ సర్కార్‌ను సాగనంపి కాంగ్రెస్‌ సర్కార్‌కు పట్టం కట్టనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. భూపీందర్‌ హుడా బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం ఖాయమని, ప్రజలు మార్పు కోరుతున్నారని స్పష్టం చేశారు. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఏడు గ్యారంటీలను కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మహిళా సాధికారత కింద 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలతో పాటు రూ.500కే గ్యాస్‌ సిలిండర్లను ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.6 వేలు పింఛన్ ఇస్తామని తెలిపింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చింది.

Spread the love