నవతెలంగాణ- విలేకరులు
ఐకేపీ వీఓఏల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు బయలుదేరిన వీఓఏలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డగించారు. తెల్లవారుజామునే నాయకులను అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పలుచోట్ల వీఓఏలు ధర్నా చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో సీఐటీయూ నాయకులను, వీఓఏలను పోలీసులు ముందస్టు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలానికి చెందిన వీఓఏలను పోలీసులు అరెస్టు చేసి నర్సాపూర్(జి) పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోనూ మహాధర్నాకు సిద్దమై వెళ్తున్న వీఓఏలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన ముగ్గురు గ్రామ దీపికలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు గ్రామదీపికలను ఆదివారం రాత్రే పోలీసులు నిర్బంధించారు. ఇంత నిరంధం విధించినా వీఓఏలు మొక్కవోని దీక్షతో తెగించి హైదరాబాద్ ఇందిరాపార్కు వద్దకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు.
మాడ్గులపల్లిలో..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి మండలాల్లోని వీఓఏలు హైదరాబాద్‌కు బయలుదేరగా.. మార్గమధ్యంలో మాడుగులపల్లి మండల కేంద్రంలో టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి టోల్‌గేట్ వద్దకు చేరుకుని వీవోఏలతోపాటు ధర్నాలో పాల్గొన్నారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకోవడం.. అరెస్టు చేయడం ఏంటని పోలీసులను నిలదీశారు. వీఓఏలను పంపించాలని పోలీసు ఉన్నతాధికారితో ఫోన్‌లో రంగారెడ్డి మాట్లాడారు. అనంతరం వీవోఏలందరినీ వాహనాలు ఎక్కించి హైదరాబాద్ పంపించారు
నల్లగొండల్లో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యను, జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాసులు, తిప్పర్తి, చిట్యాల, మాడుగులపల్లి, అనేక చోట్ల వీవోఏలను హైదరాబాదు వెళ్లకుండా అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేశారు. చిట్యాలలో సోమవారం తెల్లవారు జామున ఐదు గంటలకు సీపీఐ(ఎం), సీఐటీయూ జిట్ట నగేష్, నారబోయిన శ్రీనివాస్‌ను ఇండ్ల వద్దే అరెస్టు చేశారు.