పాలసీని చట్టబద్ధం చేయాలి

The policy should be legalized– పరిశ్రమలశాఖలో ఖాళీలు భర్తీ చేయాలి : ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీ భేషుగ్గా ఉందనీ, అయితే దాన్ని చట్టరూపంలో తెచ్చి, బడ్జెట్‌ కేటాయింపులు చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైనర్స్‌ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి చెప్పారు. పాలసీలో పేర్కొన్న అంశాలు, క్షేత్రస్థాయిలో దాని అమలు వేర్వేరుగా ఉంటాయనీ, చట్టబద్ధత కల్పిస్తే అమలు చేయక తప్పదనీ స్పష్టం చేశారు. బుధవారం హైటెక్స్‌లో సీఎం ఏ రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామిక పాలసీని ఆవిష్కరించిన కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. అనంతరం పాలసీపై ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ అభిప్రాయాల ను తెలిపారు. గడచిన పదేండ్లలో పరిశ్రమలకు దాదాపు రూ.3,900 కోట్ల ప్రోత్సాహకాలు పెండింగ్‌ లో ఉన్నాయనీ, వాటిని దశలవారీగా ఇస్తామనీ సీఎం ప్రకటించారని చెప్పారు. అయితే దాన్ని విడతలవారీ గా ఇవ్వకుండా, ఆయా పరిశ్రమల విద్యుత్‌, సేల్స్‌ట్యాక్స్‌ రాయితీల్లో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేస్తే సరిపోతుందని సూచించారు. అలాగే పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారెంటీతో పావలా వడ్డీ రుణాలు ఇస్తే నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. మూడ్నెల్లకోసారి జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ)లో తప్పనిసరిగా పరిశ్రమల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొంటే, అనేక సమస్యలకు అక్కడే పరిష్కారం లభిస్తుందని సూచించారు. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. ప్రధానంగా పరిశ్రమల శాఖలో సుదీర్ఘకాలంగా రిక్రూట్‌మెంట్లు లేవనీ, అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తొలుత దీనిపై దృష్టిపెట్టి, ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ఆ శాఖకు చెందిన కార్యాలయాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేవని గుర్తుచేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబుకు వినతిపత్రాలు అందచేశామని తెలిపారు.

Spread the love