పేదల సాగులో పోడు…అంబసత్రం భూములకు హక్కు కల్పించాలి

– పాలకుల కళ్ళు తెరిపించేందుకే
‘ప్రజాగర్జన బహిరంగ సభ
అ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-లక్ష్మిదేవిపల్లి
అనాదిగా గిరిజన, గిరిజనేతర పేదల సాగులో ఉన్న పోడు, అంబసత్రం, ప్రభుత్వ భూములపై హక్కు కల్పించి రాష్ట్ర ముఖ్యమంత్రి తన చిత్తశుద్దీని, హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. జూన్‌ 4న కొత్తగూడెం పట్టణంలో జరగనున్న ప్రజాగర్జన రాష్ట్ర స్థాయి బహిరంగ సభ ప్రచారంలో భాగంగా శనివారం లక్ష్మి దేవిపల్లి మండల పరిధిలోని రేగళ్ళ, గట్టుమళ్ళ, బంగారు చెలక, మైలారం, బొజ్జలగూడెం తదితర ఎజెన్సీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ స్థాయి సమావేశాల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ పేదల కష్టాలు గుర్తించిన కమ్యూనిస్టు పార్టీలు అప్పటి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని సాధించిపెట్టాయని, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ పథకాలను నిర్వర్యం చేసుకుట్రలు పన్నుతోందని ఆరోపించారు. 2005 పూర్వం నుంచి సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సర్వేల పేరుతో కాలాయాపన చేస్తోందని, జిల్లాలో 2.99లక్షల ఎకరాలను పోడు పట్టాలు రావాల్సి ఉన్నా ఈ సంఖ్యను కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. లక్ష్మి దేవిపల్లి మండల పరిధిలో ఏడు దశాబ్దాలుగా అంబసత్రం, ప్రభుత్వ భూములు సాగుచేసుకొని పేదలు జీవిస్తున్నారని, వీరికి ఆ భూములపై హక్కులు కల్పించా లని డిమాండ్‌ చేశారు. జూన్‌ 4న ప్రజాగర్జన సభను నిర్వహిస్తున్నామని, ఈ బహిరంగ సభకు పేదలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, దీటి లక్ష్మిపతి, నూనావత్‌ గోవిందు, జర్పుల ఉపేందర్‌, కంటెం సత్యనారాయణ, రాజశేఖర్‌, దారా శ్రీనివాస్‌, కుంజ రాంబాబు, రాజబాబు, కొమరం లలిత, కారం జనార్ధన్‌, జలీల్‌ పాషా, ప్రభు, పారుపర్తి రాజు, పడిగె చక్రపాణి, డేరంగుల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love