
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
ఎన్నికల ప్రక్రియలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పెండింగ్ దరఖాస్తులు, డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అధికారులకు సూచించారు .మంగళవారం హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ, మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా వేగంగా సవరణ పూర్తి చెయ్యాలన్నారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు, మనకు వచ్చిన ప్రతి దరఖాస్తు పూర్తి చేయాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బిఎల్ఓ లు ఇంటింటికి తిరిగి 6 కంటే అధికంగా ఉన్న ఓటర్ల వివరాల ధృవీకరణను పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ ద్వారా ఫారం 6, ఫారం 7, ఫారం 8 క్రింద వచ్చిన దరఖాస్తులను జూలై 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఓటరు జాబితా నుంచి ఓటర్ల వివరాలు తొలగించిన నేపథ్యంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఈవిఎం, వివిప్యాట్ వినియోగం పై విస్తృతఅవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ లను విజిట్ చెయ్యాలన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో మౌలిక వసతులు ప్రతిది సమకుర్చేలా ఏర్పాటు చెయ్యాలని తహసీల్దార్ లకు తెలిపారు . బిఎల్ఓస్, ఈఆర్ఓలు, అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి మళి విడత సమావేశం లోపు అన్ని పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ బెన్ సాలమ్, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.