కేంద్రంలోని మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆదివాసీల ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారింది. అడవులను కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం కోసం ఆది వాసీల గొంతు నొక్కుతున్నారు. ప్రకృతి, భూమి ఆధారంగా జీవించే వారి బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు. కులం, మతం పేరుతో ప్రజల్ని విభజించి పాలించే బీజేపీ కుట్రలు దేశమంతా చూస్తున్నాం. కానీ అడవిలో ఉండే క్రూర మృగాలైన వన్యప్రాణులతో నిత్యం సావాసం చేసే ఆదివాసీలు నేడు పాలకులను చూస్తే భయపడాల్సిన పరిస్థితి. దానికి కారణాలనేకం. ఏండ్లుగా ఆదివాసులకు ప్రత్యేక మతం ఉండాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వారి జీవనంపై ఆధిపత్య ధోరణి, విషసంస్కృతి, మతఛాందసాలు అలుముకుంటున్నాయి. రోజురోజుకూ కనుమరుగ వుతున్న జాతిని కాపాడుకోవడమే ధ్యేయంగా పోరాటాలు అనివార్యమయ్యాయి. దేశ వ్యాప్తంగా 705 ఆదిమ తెగలు ఉన్నాయి. దాదాపు అన్ని ఆదిమ తెగలు తమకంటూ ప్రత్యేక సాంస్కృతిక, జీవన విధానం, ఆచార వ్యవహారాలను పాటిస్తాయి. ఇతర మతాలకు సంబంధించిన సాంస్కృతిక, సాంప్ర దాయపు విధులు ఆయా మతాలకు సంబంధించిన మతగ్రంథల ఆధారంగా ఉంటాయి. అంటే హిందువులకు పురాణాలు, ఉపనిషత్తులు, క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఆధారంగా తీసుకొని తమ సాంప్రదాయక కార్యక్రమాలు చేపడతారు. కానీ ఆదిమ తెగలలో ప్రతీ ఒక తెగకు ఆ తెగకు సంబంధించి సాంస్కృతిక సాంప్రదాయ, ఆచారా వ్యవహారాలు తమ ప్రకృతి పరిసరాలు ఆధారంగా పురాతనంలోనే రూపుదిద్దుకున్నాయి. ఆదిమ తెగలలో కులాన్ని లేదా వర్గాలను పాటించరు.
దేశంలో 2011వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ఆదిమ తెగల జనాభా 10కోట్లా 40లక్షలు (అంటే దేశ జనాభాలో ఆదిమ తెగల జనాభ 8.6శాతం). ఆదిమ తెగల వారు ఏ మతానికి సంబంధం లేకుండా, తమ ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. వీరిని ప్రకృతి ఆరాధకులుగా నిర్థారించవచ్చు. కాలానికి అనుగుణంగా సమాజంలో వచ్చిన అనేక మార్పులు ఆదిమ తెగల ఉనికిని, అస్తిత్వాన్ని కనుమరుగు చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాలు లేదా మైదాన ప్రాంతాలకు బతుకుతెరువు, ఉపాధి ఉద్యోగాల రీత్య వచ్చిన ఆదివాసీలు స్థానికంగా ఉండే ఆదివాసీ యేతర ఆధిపత్య సంస్కృతి, ఆచార వ్యవహారాలను అలవరుచుకోవడంతో వారి ఆదిమ తెగలకు సంబంధించిన ఆచారాలు వారి తరువాతి తరాలకు అందజేయడంలో విఫలమై వారి ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఒక సమూహాన్ని ఆదిమ తెగగా లేదా షెడ్యుల్డ్ తెగగా గుర్తించాలంటే ఇప్పటి వరకు వచ్చిన కమిషన్లు ఆ సమూహం ప్రత్యేక సాంస్కృతిక పైనే ప్రాథమిక ఆధారంగా తీసుకోవాలని సూచిస్తున్నాయి. 1965వ సంవత్సరంలో లోకూర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక సమూహాన్ని షెడ్యూల్డ్ తెగగా గుర్తించాలంటే ఐదు లక్షణాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. 1.ఆ సమూహంలో ప్రాథమిక దశలోని జీవన విధానం అంటే అటవి ఉత్పత్తుల సేకరణ, వేట, ప్రకృతి ఫలాలపై ఎక్కువగా ఆధారపడడం మొదలైనవి. 2. భిన్నమైన (ప్రత్యేక) సాంస్కృతి :ఆ సమూహంలో ఇతర ఏ మతానికి సంబంధం లేకుండా ప్రత్యేక సాంస్కృతిక, భాషా, ఆచార వ్యవహారాలు, పూజా పద్ధతులు ఉండడం. 3. ఇతరులతో కలవడానికి సిగ్గుపడటం లేదా భయపడటం: తమ తెగకు చెందిన వారు కాకుండా లేదా బయటి వ్యక్తులతో మాట్లాడటానికి మరియు పరిచయాలు పెంచు కోవడానికి భయపడటం లేదా సిగ్గుపడటం. 4. భౌగోళిక నిర్భంధం: భౌగోళికంగా తమ సరిహద్దులను ఏర్పర్చు కొని బయటి వ్యక్తులు తమ సరిహద్దులు దాటి లోపలికి రానియకుండా, లేదా తాము ఆ సరిహద్దులు దాటకుండా ఉండే భౌగోళిక నిర్భంధమైన లక్షణం. 5. వెనుకబాటుతనం: ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఆ సమూహం సాధారణ సమాజం కంటే వెనుకబడటం. ఈ ఐదు లక్షణాలను ప్రామాణికంగా తీసుకొని ఒక సమూహాన్ని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని లోకూర్ కమిటీ సూచించింది.
ఆదివాసీలకు ప్రత్యేక మతం ఎందుకు అవసరం?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిషు ప్రభుత్వం ఆదిమ తెగలను ఆనిమిష్ట్‌గా పరిగణించింది. ఆనిమిష్ట్ అంటే జీవాత్మను నమ్మడం. సాధారణంగా చెప్పాలంటే ప్రతీ జీవి, ప్రతీ వస్తువు, ప్రతీ ప్రాంతం, అడవి, కొండా, చెట్టూ పుట్టా అన్నిట్లో జీవం ఉందని భావనతో దైవంగా కొలిచేవారు. స్వాతంత్య్ర అనంతరం 1951వ సంవత్సరం మొట్టమొదటి జనగణనలో ఆదిమ తెగలను ‘ట్రైబ్’గా గుర్తించేందుకు 9వ కాలంని ఏర్పాటు చేసింది. ఆ తరువాత 1961వ సంవత్సరం జనగణనలో ‘ట్రైబ్’ అనే కాలంని తీసివేసి ”ఇతరులు”లో కలిపేయడంతో ఆదిమ తెగల జనగణన స్పష్టంగా తెలుసుకునేందుకు వీలులేకుండా పోయిది. నేటి ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యంగా దేశంలోని మెజారిటీగా ఉన్న హిందువులు, క్రైస్తవులు తమ సంఖ్యను ఎక్కువగా చూపించేందుకు విఫల ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివాసీలు కొందరు హిందువులుగా, ఇంకొందరు క్రైస్తవులుగా, ఇతరాత్ర మతాలలో తమ గుర్తిపును నమోదు చేసుకోవడం వల్ల ఆదివాసీల జనాభా విభాజితమై ఉంది. దీనితో ఆదిమ తెగల జనాభా స్పష్టంగా తెలిసేందుకు అవకాశం లేదు. ఆదిమ తెగలకు ప్రత్యేక మతంగా జనగణనలో నమోదు చేసినప్పునట్లైతే అన్ని 705 ఆదిమ తెగల జనాభా సంఖ్య అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. తద్వారా ప్రభుత్వాలకు ఆయా ఆదిమ తెగల ఆర్థిక సామాజిక పరిస్థితులను స్పష్టమైన అవగాహనతో ప్రభుత్వ పథకాలు, ప్రత్యేక నిధులతో వారిని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ -244 అంశంలోని 5వ, 6వ షెడ్యూల్ సూచించిన దాని ప్రకారం ఆదిమ తెగల సాంస్కృతిక భూభాగాలు వారి ప్రత్యేక ఆచారా వ్యవహారాలతో పాటు అడవిని, ప్రకృతిని ప్రభుత్వం రక్షించవచ్చు.
ప్రత్యేక మతంగా గుర్తించకపోతే జరిగే నష్టాలు
ఆదివాసీలకు ప్రత్యేక మతంగా గుర్తించకపోతే జనగణనలో వారి గుర్తింపుని ఇతర మతాలలో నమోదు చేసుకుంటారు. వారి ప్రత్యేక సంస్కృతి, వారి తెగ భాషను కోల్పోతారు. వారి ఉనికి, ప్రత్యేక గుర్తింపు ఉండదు. వారు ఫలానా ఆదివాసీ తెగకు సంబంధించిన వారు అని ధృవీకరణ చేసుకునేందుకు ఎటువంటి ఆధారాలు ఉండకపోవడం వల్ల వారు రిజర్వేషన్ ఫలాలను కోల్పోయే అవకాశం ఉంది. ఆదిమ తెగల జనాభా ఇతర మతాలలో విభాజితమై ప్రభుత్వాలు ఆదిమ తెగలకు అందించే ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
జరిగే లాభాలు:ఆదివాసీలకు ప్రత్యేక మత గుర్తింపు ఇస్తే వారు జనగణనలో వారికి సంబంధించిన తెగలోనే వారి గుర్తింపుని నమోదు చేసే అవకాశం ఉంది. వారి ప్రత్యేక సాంస్కృతి, ప్రాచీన ఆచారాలను తరువాతి తరాలకు అందిస్తు వాటిని పరిరక్షించవచ్చు. వారి తెగ భాషను వారి సాధారణ జీవనంలో వినియోగించడం వల్ల వారి ప్రాచీన తెగల భాషను కాపాడుకోవచ్చు.వారు తమ ఉనికిని, ప్రత్యేక గుర్తింపును తరతరాలకు కాపాడుకోవచ్చు. వారికి తమ ప్రత్యేక గుర్తింపు ఉండటం వల్ల వారు ఫలాన ఆదిమ తెగకు సంబంధించిన వారిగా ధృవీకరించి, రిజర్వేషన్ ఫలాలు అందించవచ్చు. ఆదిమ తెగల జనభా సంఖ్య ప్రత్యేక మతంలో ఉండటం వల్ల ప్రభుత్వాలు చేపట్టే ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహనతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు.
ఆదివాసీలకు ప్రత్యేక మత గుర్తింపు సాధ్యమేనా?
దేశంలోని దాదాపు అన్నీ తెగలకు ఏ మత గ్రంథం ఆధారంగా లేకుండా తమదైన ప్రత్యేక సాంస్కృతి, ప్రత్యేక ఆచారాలతో ప్రకృతి ఆరాధన ఆధారంగా మతం గుర్తింపును ఇవ్వవచ్చు. జనాభా రీత్యా చూసినప్పుడు దేశంలో 8.6శాతంగా ఉంది. దీని కంటే ఇతర మైనారిటీ మతాల జనాభ సంఖ్య తక్కువ, సిక్కులు 1.7శాతం, బౌధ్ధులు 0.7శాతం జైనులు 0.4శాతాలకు ప్రత్యేక మత గుర్తింపు ఉన్నది. అలా చూసినప్పుడు 8.6శాతంగా ఉన్న ఆదివాసీల జనాభాకు ప్రత్యేక మత గుర్తింపు ఇవ్వాల్సిందే. 2011లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆదిమ తెగలను ప్రత్యేక మతంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపింది. కానీ కేంద్రం దానిపైన దృష్టి పెట్టకపోవడం శోచనీయం. 2022లో జార్ఖండ్ ప్రభుత్వం అక్కడి సంతాల్ ఆదిమ తెగకు ”సర్నా” మతం కోడ్ జనగణనలో కేటాయించాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో చర్చకు పెట్టాలని పంపింది. కానీ ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి స్పందన లేక పోవడం ఆదివాసీల అభివృద్ధిపైన బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా భావించవచ్చు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని గోండులు, ‘గోండీ ధర్మ’ కోయలు, ”కోయా పున్నెం’ గుర్తింపుకోసం ఉద్యమాలు చేస్తుండడం ఈ మధ్య కాలంలో గమనించవచ్చు.
వేగవంతమైన సామాజిక మార్పుల వల్ల ఆదిమ తెగలు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి లేకపోలేదు. ఆదిమ తెగల జీవన విధానం, వారి ప్రత్యేక సాంస్కృతికను కోల్పోతున్నారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆదిమ తెగలకు సంబంధించిన ప్రజలు ఆదివాసీ యేతర ఆధిపత్య సాంస్కృతిని వారు అలవర్చుకుంటున్నారు. దీంతో వారి గుర్తింపును, ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎక్కడ నివాసం ఉన్నా తమ గుర్తింపును, ఉనికిని కాపాడుకో వడానికి తమ సాంస్కృతిని సంరక్షిచుకోవాలన్నా, వారికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నా ఆదిమ తెగలకు జనాభ లెక్కల్లో ప్రత్యేక మతం గుర్తింపును ఇవ్వడమే అంతిమ పరిష్కారం.
– ఆత్రం తనుష్
సెల్: 9490469720