పార్లమెంట్‌లో రాష్ట్రపతి అంతర్భాగం

– కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం ముర్ము చేతులు మీదుగా జరగాలి
– తగిన ఆదేశాలు ఇవ్వండి : సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. మే 28న పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గురువారం సుప్రీంకోర్టులో న్యాయవాది సిఆర్‌ జయ సుకిన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని మే 18న లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ విడుదల చేశారని, రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ”రాష్ట్రపతి దేశపు ప్రథమ పౌరురాలు. పార్లమెంట్‌కు అధిపతి. దేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలను భారత రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి, ఉభయ సభలు రాజ్యసభ, లోక్‌సభలతో కూడిన పార్లమెంట్‌కు దేశంలో అత్యున్నత శాసనాధికారం ఉందని, పార్లమెంట్‌ నిర్వహణకు కాల్‌, ప్రోరోగ్‌ చేయడానికి, లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79ని ఉటంకిస్తూ, రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగమని, అందువల్ల ప్రారంభోత్సవానికి దూరంగా ఉండకూడదని తెలిపారు. పిటిషనర్‌ ప్రకారం, ఇది లోక్‌సభ సెక్రెటేరియట్‌లో మాల్‌ప్రాక్టీస్‌ను స్పష్టం చేసిందని, అందువల్ల ప్రకటన, ఆహ్వానాలు సరైన ఆలోచన లేకుండా ఉన్నాయని పేర్కొన్నారు.”ప్రధానమంత్రి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని సలహాతో ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్‌, యుపిఎస్సీ చైర్మన్‌, సిఈసి, ఫైనాన్షియల్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. అలాంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అక్రమం, ఏకపక్షం, అధికార దుర్వినియోగం, సహజ న్యాయసూ త్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో లోక్‌సభ సెక్రెటేరి యట్‌, కేంద్ర హౌం శాఖతోపాటు న్యాయశాఖను పార్టీలుగా చేర్చారు.

Spread the love