మంచినీటి సమస్యను పరిష్కరించాలి  పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి :

ఈదులగూడెంలో సమస్యలు తెలుసుకున్న మాజీ
ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, నిరుపేదలైన వారందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెంను ఆయన సందర్శించారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వీధుల్లోనూ కలియదిరుగుతూ సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వేసిన బోరింగులు, పైపులైన్లు తప్ప కొత్తగా ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదని విమర్శించారు. విస్తీర్ణానికి అనుగుణంగా మంచినీటి నల్లాలు కూడా వేయలేదన్నారు. కనీసం ప్రజలకు అవసరమైన రోడ్లు, సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని విమర్శించారు. అధికారులు వెంటనే చొరవ తీసుకొని పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.
కనీస వసతులు లేకుండా ప్రజలు అద్దె ఇండ్లలో అద్దెకట్టలేక అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్నారని, అట్లాగే అర్హులైన వారికి పెన్షన్‌ ఇవ్వాలని, తెల్ల రేషన్‌కార్డు ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికర్‌ మల్లేశ్‌, వన్‌టౌన్‌ కార్యదర్శి డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు గాయం రమణారెడ్డి, గాయం వీరారెడ్డి, బొల్లెంపల్లి పాపారావు, పాషా, మహిళ నాయకులు సూదిని కళమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love