గీత కార్మికుల సమస్యల పరిష్కరించాల్సిందే..

The problems of Geetha workers should be solved.– ఇచ్చిన హామీలు అమలు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
– 22న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
– విలేకర్ల సమావేశంలో సంఘం నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని కల్లుగీత కార్మిక సంఘం ( కేజీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లం కొండ వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనరసయ్య, ఎం కృష్ణస్వామితో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామంటూ వాగ్దానాలు చేశారనీ, వాగ్దానాలను నిలుపుకోవటంలో విఫలమయ్యారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం 22న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 500కోట్లు అవసరమైతే..రూ. 100 కోట్లు ఇస్తామని చెప్పి, చివరకు నామమాత్రంగా రూ. 30 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. కేటాయించిన డబ్బుల్ని సైతం ఆరు నెల్లవుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకెప్పుడు వాటిని ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. కల్లుగీత వృత్తిలో అనునిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి పట్ల ప్రభుత్వం పట్టీ పట్టనట్లు ఉంటున్నదని విమర్శించారు. ఏడాదికి సుమారు 550 మంది చెట్టుపై నుండి జారి పడుతున్నారనీ, కాళ్ళూ, చేతులు విరిగి, అంగవైకల్యులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నడుములు పడిపోయి మంచానికి పరిమితమవుతున్నారని చెప్పారు. వీరిలో 180 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ప్రమాద నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, సేఫ్టీ మోకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. గీత కార్మికులందరికీ మోటారు బైకులు ఇస్తామనీ, లిక్కర్‌ షాపులు సొసైటీలకు 15శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ నమ్మబలికారని గుర్తు చేశారు. కుల వృత్తులు చేసే వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం ఏమైందని ప్రశ్నించారు. గీతన్న బీమా పథకం అమలు చేయాలనీ, ఎక్స్‌ గ్రేషియా యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ఏరియాలోని సొసైటీలను పునరుద్ధరించాలన్నారు. వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నీరా కేఫ్‌ను అన్ని జిల్లాలకు విస్తరింప చేయాలని డిమాండ్‌ చేశారు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలనీ, ప్రభుత్వ భూమి లేనట్లయితే కొనివ్వాలన్నారు. పెన్షన్‌ రూ.5 వేలకు, ఎక్సిగ్రేషియా రూ.10లక్షల పెంచాలని డిమాండ్‌ చేశారు.

Spread the love