నవతెలంగాణ-నస్పూర్
సింగరేణి సులబ్ కాంప్లెక్స్ కార్మికుల సమస్యలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పరిష్కారం కావడం లేదని ఎస్‌సీసీడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న అన్నారు. మంగళవారం సుమంగళి ఫంక్షన్ హాల్‌లో డి.బ్రహ్మానందం(ఎస్‌సీసీడబ్ల్యూయూ) సింగరేణి కాలరీ కాంట్రాక్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని అధ్యక్షతన సింగరేణి సులబ్ వర్కర్స్ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా పర్మినెంట్ కార్మికుల అవసరాలకు సింగరేణి యాజమాన్యం సుమారు 200 పైగా సులబ్ కాంప్లెక్స్ లను నిర్మించిందన్నారు. ఈ కార్మికులకు సింగరేణి యాజమాన్యం ఎలాంటి హక్కులు సౌకర్యాలు కల్పించలేదని, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రెండు దశాబ్దాల పోరాటంలో కేవలం మినిమం వేజ్ అమలు చేస్తున్నారని, కాని సులబ్ కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసి అనారోగ్యం పాలైతే ఆదుకునే నాధుడు లేడన్నారు. గత దశబ్ద కాలం నుంచి కూడా సింగరేణిలో సులబ్ కాంప్లెక్స్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, ఈపీఎఫ్ అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నా ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ గాని సింగరేణి యాజమాన్యం స్పందించడం లేదన్నారు. నేడు ఈఎస్‌ఐ సౌకర్యం లేకపోవడంతో సులుబ్ కార్మికులు రోగాల బారిన పడి చనిపోతున్నారని అన్నారు. ప్రధానంగా సులబ్ కార్మికులు వాడే కెమికల్స్ ఫినాయిల్ బ్లీచింగ్ పౌడర్, యాసిడ్, వల్ల కండ్లు, ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయన్నారు. దుర్గంధం శుభ్రం చేయడం వల్ల విపరీతమైన దోమలు ఉన్న ప్రదేశాలలో జీవిస్తున్న కార్మికులకు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయన్నారు. కార్మికులకు తక్షణమే సింగరేణి యాజమాన్యం ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, బోనస్, సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ రాష్ట్ర సదస్సులో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం జ్యోతి, ప్రగతిశీల జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కోశాధికారి మల్లన్న, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు గజ్జి మల్లేష్, శోభ, అరుణ, సింగరేణి సులబ్ వర్కర్ నాయకులు ముత్యాల, వెంకటేష్, నరసయ్య, భూమయ్య, రాములు, వెంకటస్వామి అజరు, విజయ, జ్యోతి, అప్పారావు పాల్గొన్నారు.