– సొంత భవనాలను నిర్మించాలి
– మెనూచార్జీలు పెంచి పౌష్టికాహారం అందించాలి
– జేఏసీ ఆందోళనను విరమింపజేసేందుకు చర్యలు తీసుకోండి : సీఎస్ శాంతికుమారికి
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఐదు రకాల గురుకుల విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమింపజేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారికి బుధవారం ఆయన లేఖ రాశారు. గురుకులాల సమస్యలపై ఈనెల 18 నుంచి 23 వరకు దశలవారీగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల కింద ఉన్న ఐదు రకాల సొసైటీల పరిధిలోని 1,022 గురుకులాల్లో సుమారు 700 గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. వసతి సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్‌చార్జీలను పెంచాలనీ, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. పనివేళలను సవరించాలని తెలిపారు. ఉపాధ్యాయులు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్నారనీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. గురుకులాల్లోని సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.