– మధ్యాహ్నం 3 తర్వాత స్వీకరణ ఉండదు
– ఎస్సీ, ఎస్టీలకు రూ. 12500 సాధారణ అభ్యర్థులకు 25వేల డిపాజిట్
– అభ్యర్థులు 95 లక్షలకు మించి ఖర్చు చేయరాదు
– అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
లోక సభ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు పూర్తి సహకారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్ కోరారు. సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నామినేషన్ల ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 18 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాలపై ఆయనకూలం కుశంగా వివరించారు.లోక సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 18 నుండి 25 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని , 26 నామినేషన్ల పరిశీలన, 29 న ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు.నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్న 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,మధ్యాహ్నం 3 తర్వాత నామినేషన్లు స్వీకరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు.నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు వారితోపాటు, అనుమతించే వ్యక్తులు, వాహనాలు, తదితర అంశాలను అదనపు కలెక్టర్ వివరించారు. నామినేషన్ వేయడానికి ముందే పోటీ చేసే అభ్యర్థి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కోసం కొత్త ఖాతా తెరవాలని ఆయన తెలిపారు. నామినేషన్ల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 12500 /- రూపాయలు, సాధారణ అభ్యర్థులు 25 వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుంది అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాజకీయ పార్టీ ల ప్రతినిధులకు ఆయన అవగాహన కల్పించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం అభ్యర్థుల ఖరారు తర్వాత ఎన్నికల ఖర్చుల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పాటించవలసిన నియమ నిబంధనలు, ప్రజా ప్రతినిధ్య చట్టం పై వివరంగా తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రచురించే కరపత్రాల విషయంలో ప్రజా ప్రతినిధ్య చట్టంలోని 127 -ఏ నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని తెలిపారు. లోక సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు 95 లక్షల కు మించి ఖర్చు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ నటరాజ్, సిపిఎం పార్టీ నుండి నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి అశోక్, బిఆర్ఎస్ అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, బిజెపి నాయకులు పోతెపాక లింగస్వామి, ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రెటరీ యార శ్రీను తదితరులు పాల్గొన్నారు.