చాట్‌జీపీటీ చెప్పిందని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్

నవతెలంగాణ – టెక్సస్
చాట్‌జీపీటీతో సంభవించే ప్రమాదాలకు గొప్ప ఉదాహరణ ఈ ఉదంతం. చాట్‌జీపీటీ మాటలను నమ్మిన ఓ ప్రొఫెసర్ క్లాస్‌లోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశారు. అమెరికాలోని ప్రఖ్యాత టెక్సస్ యూనివర్సిటీలో ఈ ఘటన వెలుగు చూడటం సంచలనంగా మారింది. ఇటీవల అక్కడి విద్యార్థులు కొందరు తమ చివరి ఏడాది పరీక్షల్లో కొన్ని వ్యాసాలు రాసుకొచ్చారు. అయితే, విద్యార్థులు చాట్‌జీపీటీతో వాటిని రాసుంటారని ప్రొఫెసర్ అనుమానించారు. దీంతో, ప్రొఫెసర్ విద్యార్థుల వ్యాసాలను మళ్లీ చాట్‌జీపీటీ సాయంతోనే విశ్లేషించగా అవి విద్యార్థులు సొంతంగా రాసిన వ్యాసాలు కావని చాట్‌జీపీటీ తేల్చింది. కృత్రిమ మేధ సాయంతో రాసినట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ విద్యార్థులందరినీ ఫెయిల్ చేశారు. ఆ తరువాత చాట్‌జీపీటీ తప్పు చెప్పిందని తేలడంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశమిచ్చారు. విద్యార్థులు చాట్‌జీపీటీ సాయం తీసుకుంటున్నారన్న ఆందోళన ఇటీవల అనేక విద్యా సంస్థల్లో నెలకొంది. ఇప్పటికే కొన్ని సంస్థలు చాట్‌జీపీటీ వినియోగంపై నిషేధం విధించాయి.

Spread the love