– ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు ఉపసంహరించుకోవాలి
– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్
– హైదరాబాద్ డీఆర్వో వెంకటాచారికి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఐదు హామీలను వెంటనే అమలు చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ డీఆర్వో వెంకటాచారికి డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ సెంట్రల్, సౌత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హస్మి బాబు, జావీద్, కృష్ణ, క్రాంతి, రాజయ్య, శ్రీనివాస్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతియేటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ద్వారా నియామకాలు చేపడతామని చెప్పిందని అన్నారు. నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇస్తామని, యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిందని, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారే తప్ప అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలనే ప్రతిపాదన వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రాకుండా అన్యాయం జరుగుతుందని చెప్పారు. పదేండ్ల నుంచి నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని, ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచాలనే ప్రతిపాదనను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.