భూపాలపల్లికి రైల్‌ లైన్‌ క్లియర్‌ ఎప్పుడో ?

When will the rail line clear to Bhupalapalli?– కలగానే రామగుండం-మణుగూరు లైన్‌
– సర్వేలకే పరిమితమైన అధికారులు
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాకు రైల్‌ లైన్‌ క్లియర్‌ ఎప్పుడో అని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం భూపాలపల్లికి కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. కాజీపేట నుంచి భూపాలపల్లికి ట్రాక్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని, ఇందుకు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం జిల్లా మణుగూరు వరకు రైల్వే లైన్‌ కోసం సర్వే పనులు ప్రారంభించింది. కానీ ఆచరణలో అమలు కాలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
వరంగల్‌ నుంచి భూపాలపల్లికి రావాలంటే సుమారు 70కి.మీ బస్సులో ప్రయాణించాల్సిందే. రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రయాణం నరకయాతనే. రోజూ వందలాది మంది వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌కు భూపాలపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాజీపేట నుంచి భూపాలపల్లికి రైల్వే లైన్‌ లేకపోవటంతో ఇబ్బందులు తప్పడం లేదు. అంతే కాదు.. బొగ్గు సరఫరాకు సైతం అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ.. కాజీపేట నుంచి భూపాలపల్లికి కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు గతేడాది కేంద్రం వెల్లడించింది. ఫైనల్‌ లోకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) కోసం రూ.1,152 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని ఆధారంగా కాజీపేట నుంచి హసన్‌పర్తి లైన్‌ మీదుగా కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రెండు కిలో మీటర్ల దూరంలోని మర్రిపల్లి గ్రామం వద్ద సైడ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. మర్రిపల్లి ట్రాక్‌ నుంచి చిట్యాల మండలం జడలపేట మీదుగా భూపాలపల్లి వరకు ఈ లైన్‌ నిర్మించనున్నారు. మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి మండలాల్లోని పలు గ్రామాల మీదుగా ఇది ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో భూసేకరణతో పాటు వాగులపై వంతెనలు, స్టేషన్ల నిర్మాణం తదితర వాటితో పాటు ట్రాక్‌కు మట్టి నమూనాలు సేకరించనున్నారు. ఈ లైన్‌ నిర్మాణం పూర్తయితే 30 నుంచి 40 నిమిషాల్లో కాజీపేట నుంచి భూపాలపల్లికి చేరుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. హన్మకొండ, హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
రామప్ప, మేడారానికి అనుసంధానం
భూపాలపల్లి మీదుగా నిర్మిస్తున్న రైల్వేను పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు అనుసంధానం అవుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. రామగుండం నుంచి భూపాలపల్లి మీదుగా మణుగూరుకు వెళ్లే లైన్‌తో రామప్పకు కనెక్టివిటీ కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ కూడా ప్రకటించింది. దీని కోసం గతంలోనే వెంకటాపూర్‌లో ట్రాక్‌ నిర్మాణానికి మట్టి నమూనాలు సేకరించారు. అదే విధంగా కాజీపేట-భూపాలపల్లి లైన్‌తో మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరను అనుసంధానం చేస్తున్నట్టు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. రైలు ఆశలు పట్టా లెక్కుతుండటంతో భవిష్యత్తులో మరిన్ని కొత్త మార్గాలు ఏర్పడి భూపాలపల్లి పారిశ్రామిక అభివృద్ధికి, ములుగు పర్యాటక అభివృద్ధికి అడుగులు పడతాయని పలువురు సంతోషించారు. కానీ పనులు ఆలస్యం కావడంతో నిరాశలో ఉన్నారు.
రామగుండం-మణుగూరు సర్వే
భూపాలపల్లి జిల్లా కేంద్రం మీదుగా తొలుత కోల్‌రైల్‌కు కేంద్రం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. 2023-24 బడ్జెట్‌లో ఈ మేరకు నిధులను కేటాయించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి జిల్లా తాటిచర్ల, భూపాలపల్లి మీదుగా వెంకటాపూర్‌ (రామప్ప), తాడ్వాయి అడవుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోపాల్‌రావుపేట మీదుగా మణుగూరు వరకు 198 కిలో మీటర్ల రైల్వే ట్రాక్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఈ రైల్వేలైన్‌ నిర్మాణానికి ఫైనల్‌ లోకేషన్‌ సర్వే కోసం ప్రభుత్వం రూ.3,600 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో ట్రాక్‌ నిర్మాణానికి మట్టి నమూనాలు సేకరించారు. ట్రాక్‌ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న మట్టి తట్టుకోగలదా..? అనే అంశాన్ని పరిశీలించారు. మట్టి నాణ్యతనుబట్టి ట్రాక్‌ నిర్మాణం చేయనున్నారు. రామగుండం నుంచి మణుగూరు వరకు గుర్తించిన పాయింట్లలో మట్టి నమూనాల సేకరణ చేపట్టారు. రామగుండం నుంచి భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వేలైన్‌ నిర్మాణంతో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులకు బొగ్గు రవాణా సులభం కానుంది. ప్రస్తుతం భూపాలపల్లిలోని కేటీపీపీకి బొగ్గును రామగుండం నుంచి రైలు ద్వారా హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌కు దిగుమతి చేసుకుంటున్నారు. ఉప్పల్‌ నుంచి పరకాల మీదుగా కేటీపీపీకి బొగ్గును సరఫరా చేస్తున్నారు. దాంతో అధిక వ్యయంతోపాటు సమయానికి బొగ్గు కేటీపీపీకి చేరటం లేదు. ప్రతిపాదిత రామగుండం- మణుగూర్‌ లైన్‌ ఏర్పాటైతే ఎన్నో ఉపయోగాలు జరగనున్నాయి.
రవాణాను మెరుగుపరచాలి
జిల్లా ప్రజల ఆకాంక్షను ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రవాణాను మెరుగుపరచాలి. 2002 నుంచి 2004 వరకు బండారు దత్తాత్రేయ రైల్వే సహాయ మంత్రిగా ఉన్న సమయంలో రామగుండం- మణుగూరు రైల్వేలైన్‌ సర్వే జరిగింది. కానీ ఇప్పటి వరకు అతీగతీలేదు. ప్రధాని మోడీ సైతం పలుమార్లు హామీలు ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఈ అంశాన్ని ప్రతిసారీ నాయకులు లేవనెత్తుతున్నారు తప్పితే పార్లమెంట్‌లో గళం ఎత్తడం లేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి జిల్లాకు రైల్వే లైన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
– బందు సాయిలు, సీపీఐ(ఎం)
జిల్లా కార్యదర్శి

బొగ్గు సరఫరాకు ఉపయోగం
భూపాలపల్లికి రైల్వేలైన్‌ ప్రతిపాదించి ఏండ్లు గడుస్తోంది. కార్యరూపం దాలిస్తే బొగ్గు రవాణాతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. రామగుండం, భూపాలపల్లి, మణుగూరు రైల్వేలైన్‌ కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో బొగ్గు రవాణా సులువవుతుంది. కార్మికులకు, ప్రజలకు ప్రయాణపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రస్తుతం భూపాలపల్లిలోని కేటీపీపీ విద్యుత్‌ కేంద్రానికి రామగుండం, భూపాలపల్లితో ఇతర ప్రాంతాలకు ఎక్కువగా బొగ్గు రవాణా సాగుతోంది. రోజుకు వందల లారీల ద్వారా ఇక్కడి నుంచి ఉప్పల్‌కు బొగ్గు రవాణాకు ఇబ్బందవుతుంది. ఉప్పల్‌ వరకు లారీల ద్వారా రవాణా చేసి అక్కడి నుంచి గూడ్స్‌ రైల్‌ ద్వారా పంపిస్తున్నారు. రెండు రైల్వే లైన్లలో ఏ ఒక్కటి నెరవేరినా బొగ్గు రవాణాకు ఇబ్బందులు ఉండవు.
– కంపేట రాజయ్య, సింగరేణి బ్రాంచి కార్యదర్శి ,భూపాలపల్లి

Spread the love