పొద్దూకంగ వచ్చిన వాన, సుట్టం ఎల్లిపోరు

ఎనకట సుట్టాలు ఇంటికి వస్తే రెండు మూడు రోజులకు వెళ్లిపోదురు. ఈ రోజుల్లనైతే గంట కూడా వుంటలేరు. సుట్టం అంటే బందువు. పొద్దూకంగ అంటే పొద్దు గూటిలో పడేవేళ. అంటే రాత్రి అవుతున్నప్పుడు అన్నట్టు. ఆ సమయంలో వచ్చిన బందువులు వెళ్లిపోయేందుకు బస్సులు ఏమి వుండవు. కాబట్టి మన ఇంట్లనే వుంటడు అన్నట్టు. అందుకే ‘పొద్దూకంగ వచ్చిన వాన, పొద్దూకంగ వచ్చిన సుట్టం వెళ్ళిపోరు’ అనే సామెత పుట్టింది. వర్షం కూడా రాత్రి మొదలైందంటే నిదానంగ దంచుతనే వుంటది. ఏ తెల్లవారంగనో గెరువు అయితది. చుట్టం కోసం ఆ రోజు రాత్రి కాని తెల్లవారి కాని ఏర్పాట్లు చెయ్యాలని అర్థం. ఇట్ల మేనమామనో మేనత్తనో బావనో సడ్డకుడో ఏ సందర్భం లేకుండా చూసి పోదామని వస్తరు. ఏదైనా మనసులో సమస్య పరేశాన్‌ వుంటే ఆత్మ బందువులతో మాట్లాడే నిమ్మలం వుంటది. అసొంటి సమయంల కొందరు ఆ సుట్టానికి ఈ ఇంటి అత్తాకోడండ్ల లొల్లి, అల్లుని పంచాయితి తెల్లందాక విసిగిస్తరు. అప్పుడు ఆయన ‘సుట్టమై వస్తే దయ్యమై పట్టిండు’ అనుకుంటడు.
అట్లనే ఇంకో నిబంధన కూడా వుంటది. ‘చెడె చెల్లె ఇంటికి పోవద్దు, అలిగి అత్తగారి ఇంటికి పోవద్దు’ అంటరు. మామూలుగా పోవచ్చు, రావచ్చు. కానీ చెడిపోయి అంటే ఆర్థికంగా లాస్‌ అయి, చెల్లె దగ్గరికి పోతే బావతోని నామోషి అయితది. మనం మంచిగ వుంటేనే ఎవరైనా గౌరవిస్తరు. అలిగి అత్తగారింటికి పోవద్దు అంటరు. అసలు అలగడమే అత్తగారి ఇంటి మీద వుంటది. ఇక్కడ ఉల్టా అయితే బాగుండది అని ఆ సామెత వాడుతరు. ఏ సుట్టమైనా ఎన్ని రోజులు పోవాలనే లోకరీతి వుంటది. అందుకే ‘మూడొద్దుల సుట్టం మురికి సుట్టం’ అంటరు. మూడొద్దుల అంటే మూడు రోజులు అన్నట్టు. చుట్టం వచ్చిన రోజు మంచిగ చూసుకుంటరు. కోడికూర, కల్లు, గుడాలుతో అర్సుకుంటరు. రెండో రోజు కూడా వుంటే తెల్లవారి పప్పు, కోడి గుడ్డు పెట్టి తక్కువ రేంజ్‌లో చూస్తరు. మూడో రోజు కూడా ఇక్కడే తిష్ట వేసి వుంటే ఇంత అన్నం, పచ్చిపులుసు పోస్తరు. అందుకే మూడొద్దుల సుట్టం మురికి సుట్టం అంటరు. చుట్టాలు ఎంత దగ్గరి వాళ్లు అయినా పరిమితికి లోబడి, అవసరానికి లోబడి ఆ ఇంట్లో వుండాల్సి వుంటది. సామెతల్లో పల్లెటూరి జీవన తాత్వికత వుంటది.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love