వక్ఫ్‌ సవరణ బిల్లు -2024పై నివేదికకు రాజ్యసభ ఆమోదం

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ‘వక్ఫ్‌ సవరణ బిల్లు-2024’పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్‌, బిజెపి ఎంపీ సంజరు తదితరులు ఈ ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. నివేదికపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. తాము సమర్పించిన డిస్సెంట్‌ (అసమ్మతి) నోట్‌ను తొలగించారంటూ నిరసనకు దిగారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. ఈ నిరసనల మధ్యే ఈ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
కాగా, జనవరి 29న ముసాయిదా నివేదికను జెపిసి ఆమోదించిన విషయం తెలిసిందే. బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, ఆప్‌, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. ఈ సవరణలతో వక్ఫ్‌బోర్డులలో ముస్లిమేతరులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లుపై ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి త్వరితగతిన ఆమోదింపజేసుకుంది.

Spread the love