అసలు కారణమదే!

– సర్ఫరాజ్‌కు చోటు దక్కకపోవటంపై బోర్డు వర్గాలు
ముంబయి : వెస్టిండీస్‌ పర్యటనకు భారత టెస్టు, వన్డే జట్లను ఇటీవల బీసీసీఐ ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. సీనియర్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారాపై వేటు వేసిన సెలక్షన్‌ కమిటీ.. యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్‌ కుమార్‌లకు టెస్టు జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో గత మూడు సీజన్లుగా పరుగుల వరద పారిస్తున్న యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను సెలక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. దీంతో సర్ఫరాజ్‌ ఖాన్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదంటూ సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. మాజీ క్రికెటర్లు సైతం సర్ఫరాజ్‌ ఖాన్‌ విషయంలో సెలక్షన్‌ కమిటీపై విమర్శలు చేయగా.. తాజాగా సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన అద్వితీయ ఇన్నింగ్స్‌ల సంక్షిప్త వీడియోను పోస్ట్‌ చేసి పరోక్షంగా పంచ్‌ ఇచ్చాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ విషయంలో సెలక్షన్‌ కమిటీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అసలు అతడిని ఎందుకు జట్టులోకి తీసుకోలదనే అంశంలో బోర్డు వర్గాలు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయి.
‘ వరుసగా మూడు రంజీ సీజన్లలో 900కి పైగా పరుగులు చేసిన ఆటగాడిని విస్మరించడానికి సెలక్షన్‌ కమిటీ మూర్ఖత్వంలో లేదు. షార్ట్‌ బాల్‌పై బలహీనత, ఐపీఎల్‌లో వైఫల్యం ఏమాత్రం కారణం కాదు. అందుకు ఇతర కారణాలు ఉన్నాయి. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫిట్‌నెస్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. అతడి ఆఫ్‌ ఫీల్డ్‌ ప్రవర్తనకు సంబంధించిన అంశాలు సైతం బోర్డు దృష్టికి వచ్చాయి. మూడు సీజన్లలో 2566 పరుగులు
చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ జట్టులో చోటు సాధించేందుకు బ్యాటింగ్‌ ప్రదర్శన ఒక్కటే సరిపోతుందని భావిస్తున్నాడు. జట్టు ఆటలో ఒక్క నైపుణ్యం సరిపోదు. ప్రధానంగా ఫిట్‌నెస్‌ను బాగా మెరుగుపర్చుకోవాలి. ఈ విషయంలో అతడి తండ్రి, కోచ్‌లు దృష్టి నిలపాలని’ ఓ బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు. 37 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 79.65 పరుగులు సాధించిన సర్ఫరాజ్‌ ఖాన్‌ రంజీ ట్రోఫీలో వరుస సీజన్లలో 928, 982, 656 పరుగులు సాధించాడు.

Spread the love