భవ్యశ్రీ కేసులో అసలు నిజాలివి.. సోషల్ మీడియా పోస్టులపై హెచ్చరిక

నవతెలంగాణ – చిత్తూరు: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురంలో కలకలంరేపిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగానే దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఈబీ (సెబ్‌) ఏఎస్పీ శ్రీలక్ష్మీ తెలిపారు. భవ్యది ఆత్మహత్య కాదని, అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారన్నారు. ఈ క్రమంలో నలుగురు యువకులపై అనుమానం ఉందనడంతో ప్రశ్నిస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రుల ఎదుటే పోస్ట్ మార్టమ్ చేశారన్నారు. మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని.. అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానంతో మృతురాలి నుంచి కొన్ని శాంపిల్స్‌ తీసుకుని తిరుపతి ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. ఈ రిపోర్టుతో పాటు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవాలు బయటపడతాయన్నారు. అప్పటి వరకు అవాస్తవాలు, ఊహాగానాలు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పపన్నారు. అలాగే జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి కూడా ఓ ట్వీట్ చేశారు. పెనుమూరులో సంచలనంరేపిన 16 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్‌, అనుమానాస్పద మృతి కేసులో సోషల్‌ మీడియా వేదికగా వస్తున్న వార్తలలో ఎటువంటి వాస్తవం లేదు అన్నారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ప్రకారం మృతి చెందిన అమ్మాయిపై ఎటువంటి అత్యాచారం కానీ లేదా ఇతర గాయాలేమి శరీరంపై లేదన్నారు. అమ్మాయికి గుండు కొట్టి చంపారు అనేది అవాస్తవమని.. ఆమె తల నుంచి ఊడిపోయిన జుట్టు ఆమె చనిపోయిన బావిలో దొరికింది అన్నారు. తలపై ఎటువంటి గుండు కొట్టిన గుర్తులు కూడా లేవన్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల యొక్క కాల్‌ డేటా, టెక్నికల్ అనాలసిస్‌, ఆధారాలను నిర్థారణ చేసుకుంటూ వాళ్లను కూడా ప్రశ్నిస్తున్నామన్నారు. నిందితులు ఎవరైనా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని.. నిజానిజాలు తెలుసుకొని వార్తలను పోస్ట్‌ చేయాలన్నారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ.. సోషల్ మీడియాలో భవ్యశ్రీపై అత్యాచారం చేసి హత్య చేశారు అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.. ఈ ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Spread the love