– ఇంక్విలాబ్ జిందాబాద్
– కదం తొక్కిన రెడ్ ఆర్మీ
– దద్దరిల్లిన ప్రజా ప్రదర్శన
– కోలాట, డప్పుల దర్వులాట…విచిత్ర వేషాధారణ
– ఎర్ర తోరణమై సాగిన కార్మిక, శ్రామిక జనం
– జనంతో కలిసి సాగిన సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు
– ప్రదర్శనలో బృందాకరత్, బీవీ రాఘవులు, కేంద్ర, రాష్ట్ర నాయకులు
– ఐబీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఎర్ర ప్రవాహం
– అమరుల స్మారకంగా మూడు జ్యోతులు అందజేత
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కార్మిక, కర్షక లోకం ఎర్ర ప్రవాహమై సాగింది. రెడ్ ఆర్మీ కదం తొక్కడంతో ఎర్ర సముద్రంలా ఉప్పొంగింది. డప్పులదర్వులు, కోలాటా నృత్యాలు ధూంధాం చేశాయి. విచిత్ర వేషాధారణలు ఆలోచింపజేసి ఆకట్టుకున్నాయి. చీమల దండై కదిలిన ఎర్రసెన్యం కవాతుతో సంగారెడ్డి పట్టణం దద్దరిల్లింది. రెడ్ షర్ట్స్, ఎర్రచీరలు ధరించి… ఎర్రజెండాను భుజాన ఎత్తిపట్టి ”అదే పతాక జైత్రయాత్ర సాగుతోందిరా’ అంటూ పాట పాడుతూ ఆటలాడుతూ సాగిన ప్రజా ప్రదర్శన అబ్బురపరిచింది. ఈ నెల 25-28 తేదీల్లో సంగారెడ్డి పట్టణంలోని కామ్రేడ్ సీతారాం ఏచూరి, కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో (గోకుల్ గార్డెన్) జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభల్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఐబీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా సాగారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది సీపీఐ(ఎం) కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, పేదలు, మహిళలు పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఐబీ నుంచి ప్రారంభమైన ప్రజా ప్రదర్శన బహిరంగ సభాస్థలికి చేరుకుంది. ప్రదర్శన ముందు భాగాన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, బీవీ రాఘవులు, కేంద్రకమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, టి.సాగర్, అబ్బాస్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ఇతర ముఖ్య నాయకులు ముందు భాగాన సాగారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై బృందాకరత్ ప్రజలకు అభివాదం చేశారు.
డప్పుల దర్వులు…కోలాటాల నృత్యాలు
సీపీఐ(ఎం) ప్రజా ప్రదర్శనలో డప్పు కళాకారులు చిందేస్తూ దరువేశారు. ప్రదర్శన అగ్రభాగాన సాగిన డప్పు కళాకారులు ఎర్రజెండా పాటల ఊపులో ఆడిపాడారు. ఎర్ర దుస్తులు ధరించి ప్రత్యేక శిక్షణ పొందిన కళాకారులు ప్రదర్శనకు ఊపుతెచ్చారు. మహిళా కళాకారులు కోలాటాల నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెండూ మూడు కోలాట దళాలు ఎర్రజెండా పాటలపై కోలాట దర్వులేస్తూ ఆడాయి. అదే విధంగా ప్రదర్శనలో విచిత్ర వేషాధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలే కాకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలు, మతోన్మాద పోకడల్ని ఎత్తిచూపుతూ వేసిన వేషాలు ఆలోచింపజేశాయి. రాజ్యాంగానికి ముప్పు వాటిల్లిన నేపథ్యంలో సీపీఐ(ఎం) రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించింది. ప్రదర్శనలో రాజ్యాంగం చేతబట్టిన ఇద్దరు కళాకారులు అంబేద్కర్ వేషాధారణతో ప్రదర్శనలో ముందు నడిచారు. అదే విధంగా బీజేపీ దేవుళ్ల జపం చేస్తూ మతాన్ని రాజకీయాలకు వాడుతున్న దృశ్యం కూడా మతసామరస్యం కోరుకునే వాళ్లను ఆలోచింపజేసింది. సరళీకృత విధానాల వల్ల పేదలు మరింత పేదలవుతున్న తీరు.. హిందూ, ముస్లీం, క్రిష్టయన్ వేషాధారణలో మత సామరస్యాన్ని కోరే సందేశానిచ్చారు. మతోన్మాద భూతం, రైతులు, కనీస వేతనాల్లేని కార్మికులు, హింసకు గురవుతున్న మహిళల వంటి వేషాధారణలు ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచాయి.
కదం తొక్కిన కార్మిక వర్గం
ప్రజా ప్రదర్శనలో కార్మిక వర్గం కదం తొక్కింది. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న సంగారెడ్డిలో సీపీఐ(ఎం) కార్మిక వర్గం గట్టి పునాధి కలిగి ఉన్నది. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి కార్మికులకు మెరుగైన వేతనాలు సాధించి పెట్టింది. అందుకే సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల ప్రదర్శనలో ఎర్రజెండాలు చేతబూని కదం తొక్కుతూ కదిలారు. అసంఘటిత రంగంలోని హమాలీ, ట్రాన్స్‌ఫోర్ట్, భవన నిర్మాణ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. భూ నిర్వాసితులు, రైతులు, గ్రామీణ, పట్టణ పేదలు, ఇండ్ల స్థలాల పోరాటంలో పాల్గొన్న పేదలు అత్యధికంగా ర్యాలీకి తరలివచ్చారు.