– ప్రత్యేక అధికారులుగా నియామకం… కలెక్టర్లకు అందిన ఉత్తర్వులు
– పర్సన్ ఇన్‌చార్జీల పాలన సాధ్యం కాదన్న ప్రభుత్వం
– అవినీతి, అక్రమాల మరక అంటకుండా జాగ్రత్త
– ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన
నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కార్యదర్శులకే పంచాయతీల పగ్గాలు అప్పజెప్పనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పంచాయతీ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను కార్యదర్శులకే కట్టబెట్టేందుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలు చేసేందుకుగాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆయా జిల్లా కలెక్టర్లకు ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. గ్రామపంచాయతీల ఐదేండ్ల పదవీకాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో వాటి నిర్వహణ బాధ్యతలు, పరిపాలన వ్యవహారాల్లో కొనసాగుతున్న కార్యదర్శులకే ఇవ్వడం మంచిదని ప్రభుత్వం భావించింది. మరోపక్క ప్రస్తుత సర్పంచ్‌లు మాత్రం తమకే పదవీ కాలం రెండేండ్లు పొడిగించి పర్సన్ ఇన్‌చార్జీల పాలన తేవాలని కోరారు. అయితే సర్పంచుల ఐదేండ్ల పదవి కాలంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల మరకను తమకు అంటకుండా ప్రభుత్వం జాగ్రత్త పడినట్టు సమాచారం. అందుకే సర్పంచ్‌ల ప్రతిపాదనను పక్కనపెట్టి కార్యదర్శులకే గ్రామ పంచాయతీల నిర్వహణ బాధ్యత అప్పజెప్పినట్టు తెలుస్తోంది.రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల ఐదేండ్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేనందున ప్రత్యేక అధికారుల పాలనవైపు ప్రభుత్వం అడుగులు వేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న 12769 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు స్పష్టమవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1615 గ్రామపంచాయతీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647, సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 31తో ముగియనుంది. ఐదేండ్ల పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ సమీప కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో మరో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల జరపాల్సి వస్తే పాత రిజర్వేషన్ కొనసాగించాలా లేక రిజర్వేషన్లను మార్పులు చేయాలనేది చట్ట పరిధిలో ఉన్న అంశం. మరోపక్క బీసీ జనగణన చేయడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నందున బీసీ జనాభా తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలనేది మరొక సాంకేతిక సమస్యగా ముందుంది. మరోవైపు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే వెంటనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు కూడా జరపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో కూడా ఎన్నికలు జరిపి తీరాలి. వరుసగా ఎన్నికలు జరపాల్చి వస్తే రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా ఎన్నికల పనితోనే సరిపుచ్చుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులరీత్యా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించిన పనులు కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థిక పరిపుష్టిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక పాలన తెచ్చి ఎన్నికలను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది.
31తో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం
రాష్ట్రవ్యాప్తంగా 12769 గ్రామపంచాయతీల పాలకవర్గాల ఐదేండ్ల పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. 2018లో తీసుకొచ్చిన పంచాయత్ చట్టం ప్రకారం అప్పట్లో తెలంగాణలో కొత్త రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో 12769 మంది సర్పంచులు, 1,13,000 మంది వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. వీరందరి పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది.
ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలన
గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిపే అవకాశం లేనందున ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. ఐదేండ్ల పదవీకాలం ముగిసిన గ్రామపంచాయతీ పాలకవర్గాలు అధికారం కోల్పోతాయి. దీంతో గ్రామపంచాయతీల పరిపాలన వ్యవహారాలు, ప్రజల అవసరాలు, గ్రామఅభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమలుకు సంబంధించిన అంశాలను ఎవరు నిర్వ హించాలనే సమస్య ముందుకు రానుంది. అందుకోసమే పంచాయతీ పాలకవర్గాలకు ప్రత్యామ్నాయంగా అధికార యంత్రాంగం ద్వారా పరిపాలన వివరాలు కొనసాగిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది.గతంలో ఒకటి రెండుసార్లు గ్రామ పంచాయతీలకు ఐదేండ్ల పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు జరపడం సాధ్యం కానీ వేళ అప్పట్లో కూడా ప్రత్యేక అధికారుల పాలన అమలు చేశారు. ప్రస్తుతం కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేనందున ప్రత్యేక అధికారులకే గ్రామ పంచాయతీల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారి ద్వారానే రాబోయే కాలంలో పంచాయతీల వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా గ్రామపంచాయతీలకు జిల్లా, మండలాల వారిగా ప్రస్తుతం పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను అటు ఇటుగా మార్పులు చేసి స్పెషలాఫీసర్ నియామకం చేశారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నాయకులు, మంత్రులు, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన విషయంలో పేర్లను ఖరారు చేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తున్నది. ఆయా గ్రామ పంచాయతీలకు నియమించబడిన స్పెషల్ ఆఫీసర్లు గ్రామపంచాయతీ పరిపాలన వ్యవహారాలు చూడనున్నారు. అదేవిధంగా మండల స్థాయిలోనూ స్పెషల్ ఆఫీసర్లు కొనసాగుతారు.
అవినీతి మరకంటకుండా జాగ్రత్త
2019లో ఎన్నికల్లో గెలిచిన గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో తమ పదవీ కాలాన్ని మరో రెండేండ్లపాటు పొడిగించాలని రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ ఐదేండ్ల కాలంలో గత ప్రభుత్వం పరిధిలో గ్రామపంచాయతీ పాలకవర్గాల నేతృత్వంలో ఎంతో అభివృద్ధి జరిగినప్పటికీ అంత మేరకు అవినీతి అక్రమాల మార్క్ కూడా ఉన్నది. ఆ అవినీతి మరకను తమ ప్రభుత్వానికి అంటించుకోకూడదని భావించిన కాంగ్రెస్ సర్పంచ్‌ల పదవీకాలం పొడిగించేందుకు సిద్ధపడలేదు. అత్యధిక మంది సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు బీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లు కావడం వల్ల కూడా వాళ్ల చేతికే మరి కొంతకాలం పంచాయతీల అధికారాన్ని కట్టబెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశం. దీంతో పర్సన్ ఇన్‌చార్జీల పాలన కాకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనవైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపిందని చెప్పొచ్చు.