ఆశా వర్కర్ల పారితోషికాన్ని రూ.18 వేలకు పెంచాలి

– సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య
– సమస్యల పరిష్కారం కోసం 25 నుంచి నిరవధిక సమ్మె
– వైద్య అధికారులకు సమ్మె నోటీసు అందజేసిన ఆశాలు
నవతెలంగాణ-ఆమనగల్‌
ఆశా వర్కర్ల పారితోషికాన్ని రూ.18 వేలకు పేంచి ఫిక్స్డ్‌ వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు ఈ నెల 25 నుంచి చేపడుతున్న నిరవధిక సమ్మెను పురస్కరించుకుని మంగళవారం ఆయా మండలాల మెడికల్‌ ఆఫీసర్లకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య హాజరై మాట్లాడారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్‌ వేతనం అమలు చేసి పీఎఫ్‌ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. అదేవిధంగా హెల్త్‌ కార్డులు అందజేసి వ్యక్తిగత బీమా సౌకర్యం రూ.5 లక్షలకు తగ్గకుండా అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్నింటినీ వారికి వర్తింప చేయాలని, పెండింగ్‌లో ఉన్న టీబీ లెప్రసీ కంటి వెలుగు తదితర బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు అనేక సార్లు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నా వాటిని పరిష్కారం చేయనందున తప్పని పరిస్థితుల్లో 18 ప్రధానమైన డిమాండ్లతో ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు కురుమయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు సల్మా, బేబి, మంజుల, అనిత, రోహిణి, చంద్రకళ, స్వరూప, సుశీల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కడ్తాల్‌ మండలంలోని మైసిగండి పీహెచ్‌సీలో జరిగిన కార్యక్రమంలో ఆశా వర్కర్లు జ్యోతి, లావణ్య, సబిత, పద్మ, సరోజ, రజిత, ఎన్‌.జ్యోతి, అనిత, స్వరూప, ఈశ్వరమ్మ, మంజుల, జాహెద, యాదమ్మ, శ్యామల, జయలక్ష్మి, లక్ష్మమ్మ, కోమిటి, వరలక్ష్మి, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love