భవ్య అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది. వాళ్ళ అన్నయ్య కొడుకు చంటి ”అత్తా నీకు ఏదో ఉత్తరం వచ్చింది” అంటూ కవర్ చేతిలో పెట్టాడు. ‘ఎవరు రాశారబ్బా!’ అనుకుంటూ కవరు మీద ఫ్రమ్ అడ్రెస్ ఏదైనా ఉందేమోనని వెనక్కి తిప్పి చూసింది. ఎక్కడ ఫ్రమ్ అడ్రస్ లేదు. కవర్ టాప్‌లో మాత్రం పర్సనల్’ అని ఉంది. ఇంత ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఆత్రంగా కవరు చింపి లెటర్ తీసి చదవసాగింది. తనని సంబోధించిన విధానం, కింద సంతకంలో రాజేంద్ర అని పురుషుని పేరు ఉండేటప్పటికీ ఒక్కసారిగా భవ్య ఒళ్ళు జలదరించింది. తనకి ఇంత గొప్పగా ఉత్తరాలు రాసే బారు ఫ్రెండ్స్ ఎవరున్నారని ఎంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు. తనకు తెలిసినంతలో ఇంత క్లోజ్‌గా ఉత్తరాలు రాసే ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆఫీసులో కూడా తనని అందరూ సోదరభావంతో చూస్తారు తప్పించి, అంతకుమించి వేరే ఆలోచనకి తావివ్వరు. అయినా ఆశ్చర్యంగా ఉత్తరం చదవనారంభించింది.
”హలో భవ్య ఎలా ఉన్నావు? నేను మీ ఫ్రెండుని, నా పేరు రాజేంద్ర. ఐ లైక్ యూ వెరీ మచ్ ఐ లైక్ యువర్ ఫ్రెండ్షిప్. నేను మీతో మాట్లాడాలి, మా ఆఫీస్‌కి వస్తారా? మీ…. రాజేంద్ర” అంటూ చిరునామా ఇచ్చాడు. ఉత్తరం చదివేసి ఎవరన్నా చూస్తారేమోనని గబగబా మడిచి తన ర్యాక్‌లో దాచుకుంది. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఈ రాజేంద్ర ఎవరో తనకి గుర్తుకు రావట్లేదు. ఇంత గొప్పగా పూర్తి చిరునామాతో ఉత్తరం రాసాడంటే నన్ను ఎరిగి ఉన్న వ్యక్తి అయి ఉంటాడు. ఇంకా ఎవరూ ఉత్తరం విప్పి చూడలేదు కాబట్టి సరిపోయింది. నాన్నగాని, అన్నయ్యగాని చూస్తే నన్ను ఏ కీలుకాకీలు విరిచేసి ఉండేవారు” అనుకొని అలాగే ఆలోచన్లతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
భవ్య కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అకౌంటెంటుగా ఉద్యోగం చేస్తుంది. మంచి ముఖవర్చస్సు, చక్కటి పొడవాటి జడ, భానుప్రియ లాంటి అందమైన కళ్ళు, ముచ్చటైన నుదురుతో చూపరులను ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీతో ఉంటుంది. ఆఫీసులో అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటుంది. వీటన్నింటికి తోడు సమాజంలో ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటుంది. చిన్న చిన్న రచనలు, జోక్స్‌తో మొదలుపెట్టి భవ్య ఒక్కసారిగా కథా రచయిత్రిగా ఎదిగిపోయి ఉత్తమ యువ కథా రచయిత్రిగా టైటిల్ కైవసం చేసుకుంది. రచయిత్రిగా తనకి చాలామంచి పేరు ఉంది సమాజంలో.
మర్నాడు నిద్ర లేవగానే మళ్ళీ తనకి రాజేంద్ర రాసిన లెటర్ గుర్తుకు రాసాగింది. ”నన్ను ఇంతగా కలవరపెడుతున్న ఈ రాజేంద్ర ఎవరు? అన్నట్లు ఈరోజు రాజేంద్ర వాళ్ళ ఆఫీసుకు రమ్మన్నాడు కదా, జస్ట్ పరిచయం చేసుకోవడానికి. రాజేంద్ర ఎవరో, ఎలా ఉంటాడో, ఎటువంటి వ్యక్తో తెలియని అతనితో పరిచయం చేసుకోవడానికి వెళ్లడమా? మానడమా?” అని ఒకటే తర్జనభర్జన పడుతుంది మనసు. ఇక ఆఫీసుకు టైం అవ్వడంతో గబగబా తయారయ్యి ఆఫీసుకు వెళ్తున్నాను అని చెప్పి బయటపడింది. కానీ మనసు మనసులో లేదు. ఒకవేళ వెళితే ఎవరికంటన్నా పడితే ఏమన్నా ఉందా? అసలే తనకి సంబంధాలు చూస్తున్నారు. తన మనసుని తానే సమాధానపరుచుకుని నేరుగా తన ఆఫీసుకే వెళ్ళింది. అయినా తన మనసు ఎందుకో రాజేంద్ర దగ్గరికి వెళ్లడానికే పరుగులు తీస్తుంది. ఎలాగో తమాయించుకుని ఐదు అవ్వగానే ఆఫీస్ నుంచి బయటపడింది. మళ్లీ రెండు రోజులకి రాజేంద్ర నుంచి లెటర్ వచ్చింది. రాత్రి అందరూ పడుకున్నారని నిర్ధారించుకుని లెటర్ విప్పి చదవసాగింది.
”హలో డియర్ భవ్య! ఈసారి మీరు నన్ను గుర్తు పట్టే వుంటారు కదూ. మీరు మొన్న మా ఆఫీస్ కి వస్తారని కళ్ళు కాయలు కచేలా ఎదురు చూశాను. గంట, రెండు గంటలు, మూడు గంటలు ఆఫీసు ముందు నిల్చుని మీరాక కోసం ఎదురు చూశాను. అన్నట్లు మీరు నాకు ఎలా తెలుసో చెప్పలేదు కదూ. మీరు కొద్దిగా ఊహించే ఉంటారనుకున్నాను. మీ రచనలు మ్యాగజైన్స్‌లో చూసి, మెచ్చి, మిమ్మల్ని జీవిత భాగస్వామిని చేసుకోవాలని, మీ పరిచయ భాగ్యం కోసం ఇలా రమ్మన్నాను. కానీ సంప్రదాయానికి కట్టుబడో, సమాజానికి భయపడో రాలేకపోయారు అనుకుంటా. అలా మీ కోసం ఎదురు చూసీ చూసీ కాళ్ళు లాగేస్తూ కళ్ళు తిరుగుతుంటే ఆఫీస్‌కి లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్లిపోయాను. నేను మిమ్మల్ని చీటింగ్ చేయడానికి మాత్రం ఇలా రాయట్లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఐ లైక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యు వెరీ మచ్. ఐ లవ్ యు, ఐ లవ్ యు, లవ్ ఈజ్ లైఫ్, ఈజ్ లవ్. జన్మ జన్మలకి మీ జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటూ మీ రాజేంద్ర.”
లెటర్ పూర్తిగా చదివిన భవ్యకి రాజేంద్ర తన మీద చూపించే ప్రేమకి కళ్ళవెంట నీళ్ళు తిరిగి అతన్ని కలవనందుకు ఏడ్చేసింది. తనకి ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు. ఆ మధ్య ఎప్పుడో అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి భవ్యకి.
”అమ్మా భవ్యా… ఎప్పుడూ మనం కోరుకునే వ్యక్తి కంటే మనల్ని కోరుకునే వ్యక్తి సాన్నిహిత్యంలోనే మన ఆడవాళ్ళ జీవితం మూడు పువ్వులు – ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది తల్లి!” అంటూ చెప్తుండేది. అందుకే గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఎలాగైనా రాజేంద్రని తన జీవిత భాగస్వామి చేసుకోవాలనుకుంది. కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది భవ్య.
రాజేంద్ర నుంచి ఇలా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. కానీ సాంప్రదాయాన్ని కట్టుబడి ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలై తనలో తనే కుమిలిపోసాగింది. ఒకరోజు భవ్య తండ్రి ”అమ్మా భవ్యా… నీకు ఒక సంబంధం చూశాను. అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. నిన్ను చూడడానికి రేపు బాగుందట, వస్తామన్నారు. కానీ వాళ్ళు పెళ్లిచూపులు బందర్‌లో ఏర్పాటు చేయమన్నారు. వాళ్ళ నాన్నమ్మ ఒకావిడ అక్కడ ఉందట, ఆవిడ కూడా చూస్తుందిట. ఆవిడ రైలు, బస్సు ప్రయాణాలు చేయకూడదట. అందుకని బందర్లో ఎవరైనా చుట్టాలు ఉంటే అక్కడే ఏర్పాటు చేయమన్నారు. సరేలే మీ శశికళ అత్తయ్య ఉంది కదా అని, అక్కడే చూపించడానికి ఒప్పుకున్నాను. నువ్వు రేపు సెలవు పెట్టు. ఈరోజు రాత్రి బయలుదేరి వెడదాం” అని చెప్పారు.
”నాన్నగారు నాకు ఈ పెళ్లిచూపులు అవీ ఇష్టం లేదు. ఇక నుంచి నేను ఎవరి ముందూ అలంకరించుకుని కూర్చోలేను. నా పెళ్లి సంగతి కొన్నాళ్ళు మర్చిపోండి” అంటూ తన అయిష్టతను వెలిబుచ్చింది భవ్య.
”అన్ని మాట్లాడుకుని ఇప్పుడు కాదంటే ఎలా తల్లీ, నువ్వు చూపులకి ఒప్పుకుంటావనే నమ్మకంతో వాళ్లకి మాటిచ్చాను”
”నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చూపులకు రాను నాన్న” అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది భవ్య.
”అలా అంటే ఎలాగమ్మా భవ్య. నేనేమో పెద్దవాణ్ణయ్యాను. మీ అన్నయ్యలకి వాళ్ళ పన్లతో వాళ్లకి సరిపోతుంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో తల్లి” అంటూ బతిమాలుతున్నారు తండ్రి రాంప్రసాద్. ఇష్టం లేకపోయినా అంతగా అయితే చూసిన తర్వాత కాదని చెప్పొచ్చు అని ఒప్పుకుంది.
అక్కడ రాజేంద్ర తల్లిదండ్రులు కూడా రాజేంద్ర పెళ్లి చూపులకి సన్నద్ధమవుతున్నారు. రాజేంద్ర తండ్రి రమణమూర్తి గారు విజయవాడ వచ్చారు పెళ్లిచూపుల విషయం కొడుక్కి చెప్పడానికి. ”ఏరా రాజేంద్ర నీకు ఓ పిల్లని చూశాను. అమ్మాయి ఈ ఊర్లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. రేపు మంచిదట, చూడ్డానికి రమ్మన్నారు. చూపులు కూడా బందరులోనే ఏర్పాటు చేశారు. నువ్వు రేపు సెలవు పెట్టి రా” అంటూ చెప్పుకుపోతున్నారు రమణమూర్తి గారు.
”నాన్నగారూ… నేను ఈ పెళ్లి చూపులవి చూడనని ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పటివరకు చూసినవాళ్లలో ఒకళ్ళయినా బాగున్నారా చెప్పండి. నేనిక పెళ్లి చూపులు చూడదల్చుకోలేదు”
”నువ్వు ముందు పిల్లని చూసి మాట్లాడు. ఈ అమ్మాయి బాగుంటదని అందరూ అంటున్నారు. ఎన్నాళ్ళని ఇలా వుంటావు. మాకా ఓపికలు చచ్చిపోతున్నాయి. నన్ను వాగించక బుద్ధిగా పెళ్లి చూపులకి రా”
”ప్రతిసారి ఇలా చూసిన పిల్లనల్లా కాదనలేను నాన్న”
”నీ మనసుని అప్పుడే ఏం చంపుకోవక్కరలేదు. నీకు ముందు ముందు చాలా జీవితం ఉంది. బుద్ధిగా పెళ్లి చూపులకి రా” అని చెప్పి వెళ్ళిపోయారు రమణమూర్తి గారు.
పెళ్లిచూపుల ఘట్టం మొదలైంది. చాలా సింపుల్‌గా తయారైంది భవ్య. తన మనసు ఈ పెళ్లి చూపులకి ససేమిరా ఒప్పుకోవట్లేదు. అయినా బాధని దిగమింగుకొని మౌనంగా ఉంది. మగపెళ్ళివారు ఆటోలో తరలివచ్చారు. ”అమ్మా భవ్యా… నువ్వు లోపలికి వెళ్ళు” అని భవ్యని ప్రక్కగదిలోకి పంపి వాళ్ళ అత్తయ్య పెళ్లి వారిని లోపలికి ఆహ్వానించింది. కాసేపు ఆ మాటలు ఈ మాటలు అయ్యాక అందరూ ఫలహారాలు పూర్తి చేశారు. కానీ రాజేంద్ర మాత్రం కొంచెం కూడా ముట్టలేదు.
”బావగారు ఇహ అమ్మాయిని తీసుకు రండి” అంటూ రమణమూర్తి గారు తొందరపెట్టారు. భవ్య తలదించుకునే వచ్చి అందరికీ నమస్కరించి కుర్చీలో కూర్చుంది. రాజేంద్ర నానమ్మ ”ఒరేరు రాజేంద్ర… అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది చూసి ఒక్కసారి పలకరించరా” అంటూ చేతి మీద గిచ్చింది. అయినా కూడా రాజేంద్ర ముభావంగానే ఉన్నాడు. ఇటు భవ్య కూడా ఇష్టం లేనట్లుగా మొహం పెట్టింది తప్ప మొహంలో చిరునవ్వు అనేది లేదు. ఒక్క రాజేంద్ర తప్ప మిగతా వాళ్ళంతా ఎవరికి వారే మనసులో పిల్ల చూడముచ్చటగా ఉందనుకున్నారు. ఎంతసేపటికి రాజేంద్ర మాట్లాడకపోయేటప్పటికీ ఇక తండ్రే ”ఏవండీ రమణమూర్తి గారు, మీవాడు అమ్మాయిని పలకరించడానికి ఇబ్బంది పడుతున్నట్లున్నాడు. మనమంతా అలా డాబా మీదకి వెళ్దాం” అంటూ అందరినీ డాబా మీదకి తీసుకువెళ్లారు భవ్య తండ్రి.
ఇక రాజేంద్ర ఎలాగైనా అమ్మాయికే డైరెక్టుగా చెప్పేద్దామనుకున్నాడు ఇష్టం లేదని. ఎందుకో ఒక్కసారి తల ఎత్తి ఆమె ముఖం వంక చూశాడు. అప్పుడే భవ్య కూడా అతని వైపు చూడడానికి తల ఎత్తింది. ఒక్కసారిగా రాజేంద్ర ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. అంతే ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి దగ్గరగా వస్తూ ‘ఫొటోకి ఈవిడకి ఏమాత్రం తేడా లేదు. ఫొటోలో కన్నా ఇంకా అందంగా ఉంది’ అని మనసులో అనుకుని
”మీరు రచయిత్రి భవ్య కదూ” అంటూ ప్రేమగా చేతులు పట్టుకొని ”నేను మీ రాజేంద్రని, ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న నా కలల సుందరాంగి నా ఎదురుగానే ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా!” అంటుంటే భవ్య కూడా ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి ”రాజేంద్ర గారు! అంటూ ప్రేమని ఆపుకోలేక అతని చేతులు గట్టిగా పట్టుకుని దగ్గరకు తీసుకొని ఆనందభాష్పాలు రాల్చింది. మనం పర్సనల్‌గా కలుసుకోలేక పోయినా ఇలా పెళ్ళి చూపుల ద్వారా ఇరువురి జీవితాలు ఒకటవుతున్నందుకు నాకు ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది రాజేంద్ర గారు” అంటూ తన ఇష్టాన్ని తెలియజేసింది.
”నాకు అలానే ఉంది. నాతో కొద్దిరోజుల పరిచయానికే ఇంత ఆనందంగా ఉంటే మీతో నాకు మీ రచనల ద్వారా ఏళ్ళ పరిచయం ఉంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలనుకున్నాను. లేదా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోదామనుకున్నాను. అటువంటి దేవత ఇప్పుడూ నా సొంతం కాబోతుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి” అంటూ గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
”అబ్బా ఉండండి ఎవరైనా చూస్తారు” అంటూ తను వచ్చి కుర్చీలో కూర్చుంది. భవ్య డియర్ అప్పుడే సిగ్గుల మొగ్గ అయ్యింది” అంటూ ఇద్దరూ కలిసి పెళ్లికి పచ్చ జెండా ఊపారు.
– పింగళి భాగ్యలక్ష్మీ, 9704725609