– లేదంటే పరిణామాలు తీవ్రం : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య హెచ్చరిక
– పార్టీ ఆధ్వర్యంలో సభ, సంతకాల సేకరణ
నవతెంలగాణ-కొత్తగూడెం
రాష్ట్రంలో సింగరేణికే బొగ్గును తవ్వే హక్కు ఉండాలని, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా వేలంపాట విధానం తీసుకొచ్చి.. సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం వచ్చేలా ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించాలని భద్రాద్రి కొత్తగూడెం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభ, సంతకాల సేకరణ కార్యక్రమాల్లో కనకయ్య మాట్లాడారు. రాష్ట్రాలను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ ఒక్కొక్క ప్రభుత్వ సంస్థను కార్పొరేట్ సంస్థలకు ముట్ట చెబుతూ ప్రజల్ని మోసం చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను కల్పిస్తూ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తే తీవ్ర పరిణామాలను చవిచూడక తప్పదని హెచ్చరించారు. సీపీఐ(ఎం), ప్రజా సంఘాలు ఇప్పటికే బొగ్గు బ్లాక్‌ల ప్రయివేటుకరణకు వ్యతిరేకంగా దశల వారీ ఉద్యమాలు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న ఆరేండ్లలో సగం బొగ్గు బావులు మూతపడ తాయని, 18 వేలమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సింగరేణి పరిరక్షణకు కేంద్రంపై పోరాడాలని తెలిపారు. సభ అనంతరం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, జునుమాల నగేష్, ఎంఎస్. ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, కూరపాటి సమ్మయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.