ఓటరు జాబితా రూపొందించడంలో బీఎల్‌ఓల పాత్ర కీలకం

– కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాస్‌
– బీఎల్‌ఓలకు ఒక రోజు శిక్షణా తరగతులు
నవతెలంగాణ-ఆమనగల్‌
ఓటరు జాబితా రూపొందించడంలో బీఎల్‌ఓల పాత్ర కీలకమైనదని కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాస్‌ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్‌ జ్యోతి ఆధ్వర్యంలో ఆమనగల్‌ పట్టణంలో బీఎల్‌ఓలకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. స్థానిక రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాస్‌ పర్యవేక్షించి ఎన్నికల నియమావళి, ఓటరు నమోదు తదితర అంశాలపై బీఎల్‌ఓలకు పలు సలహాలు సూచనలు తెలిపారు. అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రణాళిక బద్ధంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలనీ సూచించారు. అదేవిధంగా చనిపోయిన వారి పేర్లను, డూప్లికేట్‌ పేర్లను నిబంధనల ప్రకారం వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందించి ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అదేవిధంగా ఓటరు జాబితాలో ప్రతి ఒక్క ఓటరు కలర్‌ ఫోటో ఉండే విధంగా, చూడగానే గుర్తు పట్టే విధంగా ఉండాలని ఆయన అన్నారు. బీఎల్‌ఓలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఓటరు జాబితా రూపొందించే విధంగా సంబందిత బీఎల్‌ఓ సూపర్వైజర్‌లు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణరెడ్డి, కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయం డీటీ హరీందర్‌ రెడ్డి, సూపర్వైజర్‌ లు, ఆమనగల్‌ మున్సిపాలిటీతో పాటు ఆయా గ్రామాలకు చెందిన బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Spread the love